కాలువా.. కష్టాలు కనవా! | Looks forward to the year for compensation | Sakshi
Sakshi News home page

కాలువా.. కష్టాలు కనవా!

Feb 3 2017 12:58 AM | Updated on Oct 1 2018 2:09 PM

కాలువా.. కష్టాలు కనవా! - Sakshi

కాలువా.. కష్టాలు కనవా!

కుప్పం నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

హంద్రీనీవా పనులకు భూములిచ్చిన రైతులు
►నష్టపరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూపులు
►కాళ్లరిగేలా తిరిగినా కనికరించని అధికారులు
► ఉపాధి కోసం పిల్లాపాపలతో పయనం
►8 గ్రామాల్లో జాడ లేని జనం
► ముఖం చాటేస్తున్న ఎస్‌వో

కుప్పం నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. హంద్రీనీవా కాల్వ రాకతో భూములు కోల్పోయిన వీరు ఇప్పుడు ఉపా««ధి కూడా  కోల్పోయారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలకు పరుగు తీస్తున్నారు. సాగు, తాగు నీరందించే కాలువ దగ్గరకొచ్చిందని సంబర పడాలో... లేక..నిలువ నీడ కరువై గూడు చెదిరి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లాలో అర్థం కాక ఈ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎనిమిది గ్రామాల్లో 80 శాతం జనం ఊళ్లు వదిలి వలస వెళ్లారు. ఉన్నకొద్ది మందీ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. నేడో, రేపో నష్టపరిహారం చేతికందుతుందని నిరీక్షిస్తున్నారు.




తిరుపతి/ కుప్పం : హంద్రీనీవా సుజల స్రవంతి పనుల్లో భాగంగా ప్రభుత్వం ఏడాది కిందట పేజ్‌–2 పనులు చేపట్టింది. ఇందులో భాగంగా పుంగనూరు బ్రాంచి కాల్వ నుంచి కుప్పం బ్రాంచి కాల్వ నిర్మా ణ పనులు చేపట్టింది. పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లి గ్రామం దగ్గరున్న పుంగనూరు బ్రాంచి కాల్వ 207వ కిలోమీటరు ఆఫ్‌టెక్‌ నుంచి ఈ కాల్వ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. 143 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ కాల్వ పెదపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లి, వీ. కోట, రామకుప్పం, శాంతిపురం, గుడు పల్లి, కుప్పం మండలాల పరిధిలోని 4.03 లక్షల మంది జనాభాకు తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యంగా నిర్ధేశించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 8 గ్రామాల పక్కనుండే 1,048 ఎకరాలను కాల్వ కోసం భూసేకరణ జరిపారు. ఏడాది నుంచి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 63 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ 45 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.

ఎకరాకు కనిష్టంగా రూ.6 లక్షలు..
కాల్వ పనుల కోసం ఏడాది కిందటే ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసింది. కుప్పం,రామకుప్పం,గుడుపల్లి, శాంతిపు రం మండలాలకు చెందిన 307 మంది రైతులకు ఎకరానికి రూ.6 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. భూములైతే తీసుకున్న సర్కారు నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ఉదాసీనత కనబరుస్తోంది. ఇక్కడున్న కుప్పం ప్రత్యేక అధికారి (కడా) శ్యాం ప్రసాద్‌ రైతులకు అందుబాటులో ఉండకుండా, ఒకవేళ ఉన్నా సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ‘మదనపల్లె రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించండనే సమాధానమే శ్యాం ప్రసాద్‌ నుంచి ఎదురవుతోందంటున్నారు. నష్టపరిహారం అందుతుందో లేదోనన్న గుబులుతో పలువురు రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు.  

పొలాలు పోయి.. గ్రామాలు ఖాళీ
కాల్వ నిర్మాణం కోసం రైతుల పొలాలను తీసుకోవడమే కాకుండా వాటి పక్కనే ఉన్న కొద్దిపాటి మిగులు భూముల్లో కాల్వను తవ్వగా వచ్చిన మట్టి, ఇతర వ్యర్థాలను వేయడంతో రైతులకు సాగు చేసే భూములే లేకుండా పోయాయి. దీంతో జబ్జిగానిపల్లె, జోగిసలార్ల పల్లి, వడ్డిపల్లి, బిజ్జిగానిపల్లి, సీబండపల్లి, పెద్దవంక, 64 పెద్దూరు గ్రామా లు ఒక్కొక్కటీ ఖాళీ అవుతున్నాయి. కుప్పం మండలంలోని పది గ్రామాలకు చెందిన రైతులు సాగు చేసుకునే 99.57 ఎకరాల భూములు తీసుకున్నారు. 187 మంది రైతులకు రూ.5.79 కోట్ల నష్టపరిహారం అందాల్సి ఉంది. గుడుపల్లె మండలంలోని 173.46 ఎకరాలకు నష్టపరిహారం అందాల్సి ఉంది. రామకుప్పం మండలంలో 336 ఎకరాలకు 646మంది రైతుల పొలాలు హంద్రీ–నీవాకు తీసుకున్నారు. శాంతిపురం మండలంలోని 416 ఎకరాలను 720 మంది రైతుల నుంచి తీసుకున్నారు. ఇప్పటివరకుఏ పరిహారం అందలేదు. కొంతమందికి ఇచ్చామని అధికారులు చెబుతున్నా ఎవరికిచ్చారనే విషయం  స్పష్టం చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement