అక్షరాలు నేర్పని సాక్షరభారత్‌ | Lack of monitoring | Sakshi
Sakshi News home page

అక్షరాలు నేర్పని సాక్షరభారత్‌

Feb 11 2017 10:28 PM | Updated on Sep 5 2017 3:28 AM

అక్షరాలు నేర్పని సాక్షరభారత్‌

అక్షరాలు నేర్పని సాక్షరభారత్‌

వయోజనులను విద్యావంతులుగా చేసి దేశంలో అక్షరాస్యతశాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్‌ నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పలేకపోతోంది.

► కొరవడిన పర్యవేక్షణ
► చెత్తకుప్పల్లో పుస్తకాలు


ముత్తారం: వయోజనులను విద్యావంతులుగా చేసి దేశంలో అక్షరాస్యతశాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్‌ నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పలేకపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. మండల పరిధిలోని ఏ ఒక్క గ్రామంలో సాక్షరభారత్‌ కేంద్రాలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. గ్రామపంచాయతీకి రెండు చొప్పున 28 సాక్షారభారత్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక మండల కోఆర్డినేటర్, 28 మంది గ్రామ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్‌కు రూ.8వేలు, గ్రామ కోఆర్డినేటర్‌కు ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా ప్రతీనెలా కేంద్ర ప్రభుత్వం రూ.78వేలు ఖర్చు చేస్తుంది. 2010 సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించగా ఏడు సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటికి దాదాపు రూ.65 లక్షలు పైగా ఖర్చు చేసింది.

కనీసం 65 మంది నిరక్షరాస్యులను పూర్తిస్థాయిలో అక్షరాస్యులను చేయలేదనే విమర్శలున్నాయి. అధికారుల రికార్డుల్లో మాత్రం ప్రతీకేంద్రం నిత్యం నిర్వహిస్తున్నట్లు చూపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం సాక్షరభారత్‌ కేంద్రాల్లో ఫర్నీచర్‌ కొనుగోలు కోసం మంజూరైన సుమారు రూ.1.20లక్షలు గోల్‌మాల్‌ జరిగినా సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతీ సాక్షరభారత్‌ కేంద్రానికి కుర్చీలు, జంబుఖానా, క్రీడాసామగ్రి మంజూరు చేయగా వాటిని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉన్నా అవి ఎక్కడికెళ్లాయో ఇప్పటివరకు తెలియడం లేదు.

కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ పంపిణీ చేసిన పుస్తకాలను అభ్యాసకులు చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు. దేశంలో అక్షరాస్యతను పెంపొందించాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సాక్షరభారత్‌ కేంద్రాలు రోజు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement