
జయహో ‘యువ’ భారత్
దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన జాతీయోద్యమ నాయకులు, అమర సైనికుల స్మృతి చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు దేశభక్తి భావాల్ని పెంపొందించేలా 10 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
– ఎస్కేయూ నుంచి టవర్‌క్లాక్ వరకు 10 కిలోమీటర్ల పరుగు
– అమరవీరులకు ఘన నివాళి
ఎస్కేయూ: దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన జాతీయోద్యమ నాయకులు, అమర సైనికుల స్మృతి చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు దేశభక్తి భావాల్ని పెంపొందించేలా 10 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఎస్కేయూ నుంచి టవర్‌క్లాక్ వరకు 10 కిలోమీటర్లు శనివారం ‘స్వాతంత్య్రం పరుగు ’ అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంత దూరం పరుగులో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. అంతకుముందు వీసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాల్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అమర వీరులకు ఘన నివాళి
దేశ సార్వభౌమత్వం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులకు ఎస్కేయూ యువత ఘన నివాళి అర్పించారు. 10 కిలోమీటర్ల పరుగులో విద్యార్థులందరూ పాల్గొన్నప్పటికీ, ఎంపీఈడీ విద్యార్థులు లక్ష్యాన్ని సాధించారు. జాతీయరహదారి మధ్యలో అక్కడక్కడ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఎస్కేయూ విద్యార్థులతో పాటు ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, ఎస్‌ఎస్‌బీఎన్, వాణి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. టవర్‌క్లాక్ చుట్టూ మానవహారం నిర్వహించారు. జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ఆచార్య జి.శ్రీధర్ , రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ, ప్రిన్సిపాల్స్ ఆచార్య కృష్ణానాయక్ , ఆచార్య రంగస్వామి, ఆచార్య కే. రాఘవేంద్రరావు , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య హుస్సేన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య ఏ. మల్లిఖార్జున రెడ్డి, ఫణీశ్వరరాజు, ఆచార్య పి. రవీంద్రా రెడ్డి, ఎంపీఈడీ విభాగాధిపతి డాక్టర్ ఎంవీఎస్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.