'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు | investigation is going secretly in sarika suicide case | Sakshi
Sakshi News home page

'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు

Nov 10 2015 1:14 AM | Updated on Oct 3 2018 7:42 PM

'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు - Sakshi

'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు

సంచలనం సృష్టించిన సిరిసిల్ల సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలు సనను వరంగల్ పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు.

హన్మకొండ: సంచలనం సృష్టించిన సిరిసిల్ల సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలు సనను వరంగల్ పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఖమ్మం జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు రోజులుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) క్యాంపులో సన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సారిక, ముగ్గురు పిల్లల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, మాధవితో పాటు సారిక భర్త అనిల్, అతని రెండో భార్య సనను నిందితులుగా పేర్కొన్నారు.

వీరిపై వరకట్న వేధింపులు(498-ఎ), ఆత్మహత్యకు ప్రోత్సహించడం(306) సెక్షన్ కింద కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజే అనిల్, రాజయ్య, మాధవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు జడ్జి ఎదుట హాజరు పరిచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉండగా శనివారం వరంగల్ పోలీసులు ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

రెండు రోజులుగా రహస్య విచారణ
సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసు అధికారికంగా ధ్రువీకరించలేదు. సారిక గతంలో చేసిన ఫిర్యాదులోని అంశాల మేరకు... సారిక, అనిల్, సనల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన అంశాలను పోలీసులు సన నుంచి సేకరిస్తున్నట్లు తెలిసింది. అనిల్‌తో జీవనం తన వల్ల కాదని, తనకు న్యాయం చేయాలంటూ కొన్ని నెలల క్రితమే రాజయ్య వద్దకు సన పంచాయతీ తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రూ.10 లక్షలు చెల్లించాలని ఒప్పందం జరిగినట్లు విచారణలో సన తెలిపినట్లు సమాచారం.

ఇప్పటికీ అనుమానాలే..
సారిక, ఆమె ముగ్గురు పిల్లల మరణాలపై అనుమానాలు వీడటం లేదు. సంఘటన జరిగిన రోజు రాత్రి వాస్తవంగా ఏం జరిగిందనే అంశం మిస్టరీగానే ఉంది. దుర్ఘటనకు ఆస్తి వివాదాలు ఏమైనా కారణమయ్యాయా అనేది తేలాల్సి ఉంది. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగిన తీరుపై స్పష్టత రాలేదు. అదేవిధంగా సంఘటనకు ముందు రోజు రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే అనుమాలు సైతం వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలనుందనే అంశం చర్చనీయూంశంగా మారింది. సారిక, ముగ్గురు పిల్లల మరణం కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సనను రెండు రోజులుగా రహస్యంగా విచారిస్తున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు అనిల్, రాజయ్య, మాధవిల విచారణపై దృష్టి సారించాల్సి ఉంది. వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ వేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement