తమ పిల్లలతో పాఠశాలలో పనులు చేయిస్తే ఎలా అని తల్లిదండ్రులు టీచర్లతో వాగ్వాదానికి దిగిన సంఘటన ఎర్రగుంట్లలో సోమవారం చోటుచేసుకుంది.
ఎర్రగుంట్ల: తమ పిల్లలతో పాఠశాలలో పనులు చేయిస్తే ఎలా అని తల్లిదండ్రులు టీచర్లతో వాగ్వాదానికి దిగిన సంఘటన ఎర్రగుంట్లలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇందులో చదువుకోవడానికి పంపిస్తే.. పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కసువు ఊడ్చే పని, మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారని వాపోయారు. తమ ఇంట్లో కూడా పనులు చెప్పడం లేదని, అలాంటప్పుడు ఇలా చేయిస్తే ఎలా అని పేర్కొన్నారు. పనులు చెప్పలేదని హెచ్‌ఎం మరియమ్మతోపాటు ఉపాధ్యాయ బృందం తెలిపారు. పిల్లలు మరుగుదొడ్లకు వెళ్లినప్పుడు నీరు పోయాలని చెప్పామని, ఎందుకంటే మిగతా వారు వెళ్లినప్పుడు శుభ్రంగా ఉండాలని కదా అని అన్నారు. ఆయాలు లేక పోవడంతో విద్యార్థులు వారు కూర్చునే చోట శుభ్రం చేసుకుంటారని చెప్పారు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ నేతలు సుబ్బిరెడ్డి, గంగిరెడ్డి, ఓబయ్య చేరుకుని విద్యార్థులతో పనులు చేయించడం తప్పని ఉపాధ్యాయులకు తెలిపారు.
ఎంఈవో విచారణ
ఎంఈవో ప్రభావతమ్మ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థిని ప్రసన్న తండ్రి బాబుతో ఆమె మాట్లాడారు. ఇక నుంచి విద్యార్థులకు పనులు చెప్పొద్దండి అని ఉపాధ్యాయులను మందలించినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న 52 పాఠశాలల్లో ఆయాలు లేరని, దీంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.