విధులు చెబుతారు.. నిధులు ఇవ్వరు | Government rushes for mega teachers parents meeting | Sakshi
Sakshi News home page

విధులు చెబుతారు.. నిధులు ఇవ్వరు

Jul 10 2025 5:06 AM | Updated on Jul 10 2025 5:06 AM

Government rushes for mega teachers parents meeting

మెగా టీచర్స్‌ పేరెంట్స్‌ మీటింగ్‌ కోసం ప్రభుత్వం హడావుడి

వారం రోజులుగా బోధనకు దూరంగా టీచర్లు 

శ్రీకాకుళం న్యూకాలనీ:  సర్కారు రికార్డుల పిచ్చి టీచర్లకు తలనొప్పిగా మారింది. కనీస నిధులు ఇవ్వకుండా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రస్తుతం మెగా పేరెంట్‌–టీచర్స్‌ మీటింగ్‌(పీటీఎం) పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గిన్నిస్‌బుక్‌లో రికార్డుల కోసం అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు.  

పీటీఎం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థుల ప్రగతిని వివరించడం.. వారికి అక్కడే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథులు ప్రసంగాలు.. ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల్లో 17 రకాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిల మేరకు కొన్ని కుదించారు. ఆహ్వాన పత్రికలు, వేదికల ఏర్పాట్లు, బహుమతుల ప్రదానం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించడం.. ఇలా వివిధ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే పడుతోంది.  

బోధనకు దూరంగా టీచర్లు.. 
నిన్న యోగాంధ్ర.. నేడు పేరెంట్స్‌ మీట్‌ అంటూ టీచర్లను సమావేశాలకు, సన్నాహాలకు పరిమితం చేస్తుండడంతో వారు బోధనకు దూరమవుతున్నారు. తాజాగా రెండు వారాల నుంచి తల్లిదండ్రుల సమావేశామంటూ నానా హంగామా చేస్తున్నారు. హోలిస్టిక్‌ ప్రొగ్రెస్‌ కార్డుల పేరిట చాంతడంత డేటాను పూరిస్తున్నారు. దీంతో విద్యాబోధన రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంలా తయారైంది. 

దీనికి తోడు తమ ప్రచార యావ, రికార్డుల కోసం ఉపాధి హామీ పథకం వేతనదారులను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు సంరక్షకులుగా వారిని వినియోగించుకుని ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.  

అంతా ‘లీప్‌’ యాప్‌లోనే.. 
తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా సమావేశం జరిగిన వెంటనే 30 సెకన్ల వీడియో, మూడు ఫొటోలను లీప్‌ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. విద్యార్థులతో మొక్కలు నాటించడం.. దాన్ని లీప్‌ యాప్‌లో నమోదు చేయించడం, ప్రతి మూడు నెలలకు ఆ మొక్క ఫొటోలను అప్‌లోడ్‌ చేయించడం ఇదంతా ఉపాధ్యాయుల పనే. దీనిపై టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

చేతిచమురు వదులుతోంది..  
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వీఐపీలు, అతిథులు, పూర్వపు విద్యార్థులు, దాతలు ఇలా అనేక మందిని పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌కు ఆహ్వానిస్తున్నారు. వీరిందరికీ భోజనాలు, స్నాక్స్‌ తో పాటు ఇతరత్రా ఏర్పాట్లకు కనీసం రూ.70వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. పాఠశాల గ్రాంట్‌ కింద కనీస నిధు లు విదల్చకుండా అందులో 20 శాతం వాడుకోండని ఆదేశాలివ్వడంపై హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు మండిపడుతున్నారు. స్థానికంగా ఉండే టీచర్లు, లెక్చరర్లు గత్యంతరం వారే తలా కొంత డబ్బులు వేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  

తమ పనితీరుకు ‘సాక్ష్యం’పై గుర్రు..  
పేరెంట్‌ టీచర్స్‌ సమావేశాల పర్యవేక్షణకు ఒక్కో పాఠశాల, కళాశాలలకు ఇతర శాఖల నుంచి ఒక ఉద్యోగిని కేటాయించారు. వీరు కార్యక్రమ నిర్వహణకు సాక్షిగా ఉంటారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో, స్థానికంగా ఉండే ఉద్యోగులు(ఐడీ నంబర్‌తో), పెద్దలను(ఆధార్‌ నంబర్‌తో) నియమించుకోవచ్చని సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చింది.  

పరీక్షలు లేని ప్రోగ్రెస్‌ కార్డులు ఎందుకు..? 
ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి పరీక్షలు జరగలేదు. ఇప్పుడు ప్రోగ్రెస్‌ కార్డులు ఎందుకో అర్థం కావడం లేదు. ఊరికే సమావేశం తప్ప ప్రయోజనం లేదు.   – తమ్మినేని చందనరావు, ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

రికార్డుల కోసం మీటింగులు తగదు..    
గిన్నిస్‌బుక్‌లో రికార్డుల కోసం రాష్ట్రప్రభుత్వం పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ 2.0 ను నిర్వహిస్తుండటం బాధాకరం. పూర్తిస్థాయిలో నిధులు కేటాయింపు చేయలేదు. టీచర్లే తలా చేయి వేసి నిర్వహిస్తున్నారు.  –బి.వెంకటేశ్వర్లు,      ఏపీటీఎఫ్‌(1938) జిల్లా ప్రధాన కార్యదర్శి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement