హాస్టళ్లలో అన్నీ సమస్యలే | Hostels problems | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో అన్నీ సమస్యలే

Jul 20 2016 9:01 PM | Updated on Sep 4 2017 5:29 AM

సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థుల ధర్నా
 
గుంటూరు ఎడ్యుకేషన్‌ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు హాస్టల్‌ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చారని, అవే హాస్టళ్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి రావెల కిషోర్‌బాబు హాస్టళ్లను ఫైవ్‌ స్టార్‌ హోటళ్లుగా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం గురుకులాల్లో ఏ రకంగా కల్పిస్తారని ప్రశ్నించారు. హాస్టళ్లను మూసివేసి పేద విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.వరప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీసీ హాస్టళ్లను బలోపేతం చేసి మరింత మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం ఉన్న వాటినే మూసివేసే విధంగా వ్యవహరించడం దుర్మార్గ చర్యని అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసివేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గురుకులాల ఏర్పాటు పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అసత్య ప్రచారం సాగిస్తున్నారని, హాస్టళ్ల విలీనం చేయడం ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో సాయి ప్రసాద్‌ విద్యార్థుల వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ధర్నాలో డీబీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు కొరివి వినయ్‌కుమార్, చేతివృత్తిదారుల సంఘ నాయకుడు బైరగాని శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్, కార్యదర్శి వి.భగవాన్‌ దాస్, నాయకులు వి.జ్యోతి, కె.పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement