ఏళ్ల తరబడి పట్టణ ఆరోగ్యకేంద్రాల నిర్వహణను చూస్తున్న బాధ్యతలను తప్పించి స్వచ్ఛంద సంస్థలకు సర్కార్ షాక్ ఇచ్చింది.
విజయనగరం: ఏళ్ల తరబడి పట్టణ ఆరోగ్యకేంద్రాల నిర్వహణను చూస్తున్న బాధ్యతలను తప్పించి స్వచ్ఛంద సంస్థలకు సర్కార్ షాక్ ఇచ్చింది. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి రికార్డులు, భవనాలు, ఉద్యోగులు, ఫర్నిచర్, మందులు తదితర అన్నింటిని వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈనెలఖారులోగా అప్పగించే పక్రియ పూర్తి కావాలని నోటీస్‌లో పేర్కొంది. జిల్లాలో 8 పట్టణ ఆరోగ్య కేంద్రాలు విజయనగరం బీసీ కాలనీలో ఒకటి, రాజీవ్‌నగర్ కాలనీలో ఒకటి, ఫూల్‌బాగ్‌లో ఒకటి, లంకాపట్నంలో ఒకటి, బొబ్బిలిలో రెండు పార్వతీపురంలో ఒకటి, సాలురులో ఒకటి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక వైద్యాధికారి, వైద్యాధికారికి సహాయకుడు ఒకరు, కమ్యూనిటీ ఆర్గనైజరు ఒకరు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక వాచ్‌మన్, ఒక అటెండర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్యకేంద్రాల నిర్వహణను స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆ బాధ్యతలను తప్పించింది.
కమీషన్ల కోసమేనా?
ప్రస్తుతం ఐదు, ఆరు స్వచ్ఛంద సంస్థలు పట్టణ ఆరోగ్య కేంద్రాలను జిల్లాలో నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ ఒకే సంస్థకు కట్టబెడితే పెద్ద ఎత్తున కమీషన్లు వస్తాయనే భావనతోనే ప్రభుత్వ పెద్దలు ఈవిధంగా స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇదే విషయాన్ని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద సాక్షి ప్రస్తావించగా స్వచ్ఛంద సంస్థలకు పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తప్పించిన మాట వాస్తవమేనని అంగీకరించారు.
19 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం
పట్టణంలోని వెనుకబడిన వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 19 వేల మంది జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. ఆయా ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న పేద ప్రజలు జలుబు, జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, గాయాల వంటి సాధారణ వ్యాధులకు అవసరమైన పరీక్షలు చేసి వాటికి మందులు అందజేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు, పిల్లలకు టీకాలు కూడా వేస్తున్నారు.