మలేరియా మరణాల కేసులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమాధి కట్టి, అవి వెలుగుచూడకుండా జాగ్రత్త పడుతున్నారు.
మలేరియా మరణాల కేసులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమాధి కట్టి, అవి వెలుగుచూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ జిల్లాలో ఒక్క మలేరియా మృతి కూడా లేదని బుకాయిస్తున్నారు. గజపతినగరం మండలం బంగారమ్మపేటలో ఇటీవల తండ్రీకొడుకులు ఒకే రోజు గంటల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. మలేరియాతో వారు మృతి చెందారని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. జిల్లాలో అసలు మలేరియా మరణాలే లేవని చెబుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఇది శరాఘాతంలా తగిలింది. అయితే పరిస్థితిని అధిగమించి, మలేరియా మరణాలు లేకుండా చూడవలసిన వారు. దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవ రిపోర్టులిచ్చిన ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులపై కక్షసాధింపు చర్యలకు, బెదిరింపులకు దిగుతున్నారు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మలేరియా నివారణకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. అదే స్థాయిలో వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి, మలేరియా మరణాలు సంభవిసే వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కఠిన చర్యలకు గురికాకతప్పదు. క్రమశిక్షణా చర్యలతో పాటు కేసులు ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకే మలేరియా మృతుల్లేవని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తరుచూ తేల్చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి కూడా అదే తీరును కనబరుస్తున్నారని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా మలేరియాతోనే మృతి చెందారని వాస్తవాల్ని నివేదించిన ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు అధికారికంగా 1969 మలేరియా కేసులు నమోదయ్యాయి. అయితే ఏ ఒక్కరూ చనిపోలేదని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. కానీ, జిల్లాలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
మలేరియా మరణాలు...
జిల్లాలో గజపతినగరం మండలం బంగారమ్మపేటకు చెందిన తండ్రీ కొడుకులు బుగత శ్రీను, శంకరరావు మలేరియాతో బాధపడుతూ మృతి చెందారు. భోగాపురం మండలం సవరవిల్లి పంచాయతీ దొంగపేటకు చెందిన కోరాడ రమణమ్మ మలేరియాతో మృత్యువాత పడింది. గుమ్మలక్ష్మీపురం మండలం దొడ్డికల్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి హిమరిక, మక్కువ కేజీబీవి పాఠశాలలో చదువుతున్న మంచాల లీలావతి మలేరియాతోనే మృతి చెందారు. అయితే ఇవేవీ మలేరియా మరణాలు కావని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుకాయిస్తున్నారు.
సాధారణంగా మలేరియా వచ్చి నాలుగైదు రోజులైతే గాని నిర్ధారణ కాదు. నిర్ధారణ అయిన వెంటనే సకాలంలో చికిత్స అందించగలగితే ప్రాణాపాయం నుంచి రోగులు బయటపడవచ్చు. అంటే జ్వరపీడితులను తొందరగా గుర్తించినట్టయితే మలేరియా ముప్పు నుంచి తప్పించవచ్చు. అలా జరగాలంటే వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలి. సర్వే చేస్తే జ్వరపీడితులను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.రోగాన్ని గుర్తించినట్టయితే సకాలంలో వైద్య సేవలందించి ప్రాణాపాయం లేకుండా చూసుకోవచ్చు. కానీ, ఆ విధంగా గ్రామాల్లో జరగడం లేదు. ఇంటింటి సర్వే సక్రమంగా చేయడం లేదు. జ్వరపీడితుల్ని గుర్తించే కార్యక్రమం సజావుగా సాగడం లేదు. దీంతో మలేరియా రోగులను సకాలంలో గుర్తించలేకపోతున్నారు. మలేరియా మృతులు నమోదమయిన ప్రాంతంలో అక్కడి సిబ్బందిపై కలెక్టర్ క్రమశిక్షణా చర్యలతో పాటు కేసుల్ని నేరుగా నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఈ చర్యల్ని తప్పించుకునేందుకే మలేరియా మరణాలు సంభవిస్తున్నా లేవని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు బుకాయిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
సిబ్బంది నుంచి ముడుపులు
సిబ్బందిని రక్షించే క్రమంలో వారి నుంచి ఉన్నతాధికారులు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మలేరియా మరణమని ధ్రువీకరిస్తే ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని, చేయి తడిపితే గండం నుంచి గట్టెక్కిస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది నుంచి కొందరు అధికారులు భారీ మొత్తంలో గుంజు కుంటున్నారని తెలిసింది.
ప్రైవేట్ ఆస్పత్రులపైనా జులుం
ఇదంతా ఒక ఎత్తు అయితే మలేరియాతో మృతి చెందారని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు నివేదికలిస్తే వారిపై కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొందరు అంతెత్తున లేస్తున్నారని సమాచారం. ఎందుకలా రిపోర్టులిచ్చారని గట్టిగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగైతే మనం మధ్య ఉన్న సత్సంబంధాలు తెగిపోతాయని, భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సి వస్తోందని బెదిరింపుతో కూడిన హెచ్చరిచ్చుస్తున్నట్టు తెలిసింది. ఇటీవల మలేరియాతో మరణించారని ఒక ఆస్పత్రి వైద్యులిచ్చిన నివేదికపై పెద్ద రాద్దాంతమే చేసినట్టు తెలిసింది. వెలుగు చూసిన కేసుల్నే బుకాయిస్తుంటే ఏజెన్సీలో వెలుగులోకి రాని గిరిజన మరణాల మాటేంటో సదరు వర్గాలే చెప్పాలి.