ప్రస్తుతం ఎద్దులు, నాగళ్ల వాడకం తగ్గిపోయి యంత్రాల వినియోగం తప్పనిసరైంది. ఒకప్పుడు ఏ గ్రామంలో చూసిన రైతుల ఇంటి ముందు పాడి పశువులు,
♦ సాగుకు పెరిగిన యంత్రాల వినియోగం
♦ డీజిల్ ధర పెంపుతో కష్టమవుతున్న సేద్యం
♦ చిన్న, సన్నకారు రైతులను భయపెడుతున్న ట్రాక్టర్ బాడుగలు
♦ రవాణా చార్జీలు, ఎరువులపైనా ప్రభావం
♦ కరువు నేపథ్యంలో కష్టాల సేద్యం
వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం పెరిగిపోయింది. సాగుకు కూలీలు దొరకకపోవడం, దొరికినా కూలి రేట్లు అధికమవడం... ఇతరత్రా కారణాలతో అన్నదాతలు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి మొదలు పంట చేతికొచ్చే వరకు యాంత్రీకరణ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులపై ప్రభుత్వం నిత్యం పెంచుతున్న డీజిల్ ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ప్రత్యక్షంగా జిల్లా రైతులపై రూ.2 కోట్లపైనే అదనపు భారం పడుతోంది.
కడప అగ్రికల్చర్: ప్రస్తుతం ఎద్దులు, నాగళ్ల వాడకం తగ్గిపోయి యంత్రాల వినియోగం తప్పనిసరైంది. ఒకప్పుడు ఏ గ్రామంలో చూసిన రైతుల ఇంటి ముందు పాడి పశువులు, కాడెద్దులు, ఎద్దులబండ్లు, వ్యవసాయ సామగ్రి కనిపిస్తూ ఉండేవి. గ్రామాల్లో ఎద్దులతో వ్యవసాయం చేసే రైతులను వేళ్లమీద లెక్కించవచ్చు. ప్రస్తుతం వాటి స్థానంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు కూడా యాంత్రీకరణ వైపే మొగ్గుచూపాల్సిన అవసరం ఏర్పడింది. ఎరువులు తరలించడానికి రవాణా పరంగానూ వాహనాల బాడుగ భారీగానే ఉంటోంది.
రైతన్నలపై రూ.2కోట్ల భారం
ఇప్పటికే రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. ఇలాంటి కరువు పరిస్థితుల్లోనే జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 1.34 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇది కాక ఉద్యాన పంటల సాగు అంతకంటే రెట్టింపుగానే ఉంది. ఈ పంటల సాగుకు 70శాతం మంది రైతులు ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎకరా భూమి దున్నడానికి గంటకు రూ.600 నుంచి రూ.700వరకు తీసుకుంటున్న ట్రాక్టర్ యజమానులు, తాజాగా డీజిల్ ధరలు పెరగడంతో ఆ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఎకరాకు రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేయనున్నారు. ఇది చూడటానికి చిన్న మొత్తంగా ఉన్నా జిల్లావ్యాప్తంగా తీసుకుంటే ఈ భారం రైతుకు తడిసిమోపెడు కానుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న భూములకు సంబంధించి వ్యవసాయ పనులు చేయడానికి రైతులపై రూ.2 కోట్ల వరకు డీజిల్ భారం పడుతోంది.
వ్యవసాయం భారంగా మారింది: రాను రాను వ్యవసాయం భారంగా మారింది. ఒక పక్క పెరిగిన ఎరువుల ధరలు, మరోపక్క విత్తనాల ధరలు, ఇంకో పక్క కూలి రేట్లు వేధిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ డీజిల్ ధరలు పెంచితే ఎట్లా వ్యవసాయం చేయాలి. వరిసాగు చేయాలంటే ట్రాక్టరుతో మెత్తగాను, మళ్లీ దమ్ము చేయడం వంటి పనులకు ఎకరాకు రూ.1,500-2,000 అవుతుంది. ఇది ఇప్పుడు పెరిగిన డీజిల్‌కు అనుగుణంగా ఉంటుంది.
- చెన్నయ్య, రైతు, పాలెంపల్లె, కడప మడలం.
నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు
పెరిగిన పెట్టుబడులతో సతమతమవుతున్న రైతులపై కేంద్రం ధరలు పెంచుతూ మరింత భారం వేస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే డీజిల్ ధరలను మూడుసార్లు పెంచింది. తాజాగా మరోసారి గత బుధవారం రాత్రి లీటరు డీజిల్‌పై రూ.1.26 పెంచింది. నెలా పదిహేను రోజుల్లో నాలుగుసార్లు కలిపి రూ.7.72పైసల మేర ధర పెరిగింది. దీంతో జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 60.88 పైసలకు చేరింది. భారీఎత్తున పెరిగిన డీజిల్ ధరతో జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది. ట్రాక్టర్ల వినియోగం, ఆయిల్ ఇంజన్లు, ఇతర యంత్రాలకు డీజిల్ వినియోగం తప్పనిసరి.
డీజిల్ ఖర్చులకు ప్రభుత్వం సాయమందించాలి: విత్తన ధరలు, ఎరువుల ధరలు ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకునే విధంగా కంపెనీలకు, ఏజెన్సీలకు అవకాశం కల్పించారు. అదే రైతులు పండించే పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించరు. కేంద్రం ఇష్టమొచ్చినట్లు డీజిల్ ధరలు పెంచుతూ పోతే రైతులు ఎలా పంటలు సాగు చేసుకుంటారు. ప్రతిదానికి ఇప్పుడు ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నాం. ట్రాక్లర్ల వారు బాడుగులు పెంచుతున్నారు. డీజిల్ ధరలకు అనుగుణంగా ఖర్చులు చెల్లించేలా ప్రభుత్వం సాయమందించాలి. - మునిరెడ్డి, ముండ్లపల్లె, చెన్నూరు మండలం.
రైతులకు డీజిల్ ధరలు మినహాయింపు ఇవ్వాలి: వ్యవసాయానికి వినియోగించే డీజిల్‌కు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. దీంతో రైతులకు ఈ డీజిల్ ధరలు మోయలేని భారంగా ఉన్నాయి. ట్రాక్టర్ల యజమానులు గంటకు బాడుగలను లెక్కకట్టి రాబడతారు. ఇది చిన్న, సన్న కారు రైతులకు మోయలేని భారమే.
- నాగసుబ్బయ్య, యువరైతు, కత్తులూరు, వేంపల్లె మండలం.
వ్యవసాయానికి సబ్సిడీపై డీజిల్‌ను అందించాలి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇస్తున్నాయి. అయితే డీజిల్ మాత్రం పెంచుకోవడానికి కంపెనీలకు అనుమతులు ఇచ్చేటప్పుడే వ్యవసాయదారులకు ఇన్ని లీటర్ల వరకు వినియోగిస్తే సబ్సిడీ ఉంటుందని ఎందుకు ప్రకటించకూడదు. వ్యవసాయానికి డీజిల్‌ను సబ్సిడీపై ఇచ్చేలా అనుమతులు ఇవ్వాలి.
- జయరాముడు, రైతు, కేశలింగాయపల్లె, మైదుకూరు మండలం