చినుకు పడక..! | farmers waiting for rain to kharif | Sakshi
Sakshi News home page

చినుకు పడక..!

May 30 2017 11:31 PM | Updated on Sep 5 2017 12:22 PM

చినుకు పడక..!

చినుకు పడక..!

ప్రస్తుతం ఖరీఫ్‌ సీజను ప్రారంభమవుతోంది. వరుణుడు మాత్రం కరుణించడం లేదు.

కారుమబ్బులతోనే సరి
∙ దుక్కులకు నోచుకోని చేలు
∙ వరుణుడి కరుణ కోసం రైతన్న ఎదురుచూపు


ప్రస్తుతం ఖరీఫ్‌ సీజను ప్రారంభమవుతోంది. వరుణుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతన్నల్లో ఆందోళన మొదలైంది. చినుకు నేల రాలక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇంతవరకు వర్షం రాకపోవడంతో పొలాల్లో దుక్కులు సిద్ధం చేయడానికి కావడం లేదు. ఇంకా పొలాలన్నీ బీడుగానే దర్శనమిస్తున్నాయి. దీంతో అన్నదాతలు వరుణుడు కరుణించకపోడా అని..  ఆశగా ఎదురు చూస్తున్నారు.

చిత్తూరు (అగ్రికల్చర్‌): జిల్లా రైతులు ఖరీఫ్‌ సీజనులో ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడి వేరుశనగ పంటను సాగు చేస్తారు. మామూలుగా అయితే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే మే రెండోవారం నుంచే అడపా దడపా వర్షం పడుతుంది. దీంతో వేరుశనగ సాగుకు అనువుగా రైతులు ముందస్తుగా దుక్కులు దున్నుకునేవారు. జూన్‌ 7 నుంచి 22వ తేదీ వరకు కొనసాగే మృగశిర కార్తెలోనే రైతులు వేరుశనగ విత్తుతారు. ఇదే తరహాలోనే గత ఏడాది కూడా మే రెండవ వారం నుంచే ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు మృగశిర కార్తెలోనే విత్తడం పూర్తి చేశారు. గతేడాది వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని∙అధికారులు  ప్రస్తుతం సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీని మే 25 నుంచే ప్రారంభించారు.

ఊరిస్తున్న వరుణుడు..
మే మొదటి వారంలో మాత్రం అడపాదడపా కొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా మండలాల్లోని కొందరు రైతులు దాదాపు 5 వేల హెక్టార్ల మేరకు తొలివిడత దుక్కులు దున్నారు. అప్పటి నుంచి ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో వరుణుడు ఊరిస్తున్నాడు. మబ్బులు కమ్ముకున్న వెంటనే పెనుగాలులు రావడం, పిడుగులు పడడంతో ఉద్యాన పంటల రైతులు నష్టపోతున్నారు తప్ప మిగిలిన అన్నదాతలకు ఉపయోగం లేకుండాపోతోంది.

దుక్కులకు నోచుకోని చేలు..
సాధారణంగా రైతులు ఖరీఫ్‌ సీజనులో మొత్తం 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేస్తారు. సకాలంలో వర్షం పడితే మే నెలాఖరుకు దుక్కులు సిద్ధం చేసుకుంటారు. కానీ జూన్‌ మాసం ప్రారంభమవుతున్నా వర్షం రాకపోవడంతో కనీసం తొలి విడత దుక్కులు కూడా దున్నుకోలేదు. ఫలితంగా వేరుశనగ సాగయ్యే చేలు బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి.

వరుణుడి కోసం ఎదురుచూపులు...
సాధారణంగా మే నెలలో 201 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే మే నెల పూర్తవుతున్నా ఇప్పటి వరకు జిల్లాలో 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఒకవైపు చినుకు జాడ లేదు. దీనికి తోడు ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కొన్ని మండలాల్లో ఇంతవరకు చేపట్టలేదు. జిల్లాకు మొత్తం 84,500 క్వింటాళ్ల మేర విత్తన కాయలను కేటాయించినా, ఇప్పటి వరకు 51 వేల క్వింటాళ్ల వరకు జిల్లాకు వచ్చాయి. వాటిలో కూడా కాయలు సరిగా లేవని 10 వేల క్వింటాళ్ల మేర అధికారులు వెనక్కి పంపారు. దీంతో 41 వేల క్వింటాళ్ల మేరకు మాత్రమే కాయలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది వేరుశనగ పంట సాగు సైతం ప్రశ్నార్థకంగా మారనుంది.

దుక్కులు కూడా దున్నలేదు..
మామూలుగా అయితే ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకుని జూన్‌ రెండవ వారంలోగా విత్తనం వేస్తాం. కానీ ఈసారి ఇంతవరకు వర్షం కురవకపోవడంతో తొలివిడత దుక్కులు కూడా దున్నుకోలేకపోతున్నాం. – లోకనాథరెడ్డి, రైతు, 35 ఎల్లంపల్లె, ఐరాల మండలం

విత్తన పంపిణీలో నిర్లక్ష్యం..
ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఆ లస్యంగా విత్తనాలు పంపిణీ చేస్తే సిద్ధం చేసుకునేందుకు మరికొంత సమయం వృథా అవుతుంది.
– ఆరుద్రరెడ్డి, రైతు, చిత్తూరు రూరల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement