ఇక ‘ఆంగ్ల’వాడీలు

ఇక ‘ఆంగ్ల’వాడీలు - Sakshi


– అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌

– 10 మునిసిపాలిటీల్లో అమలుకు శ్రీకారం

– నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో విద్యాబోధన

– కార్యకర్తలకు కొనసాగుతున్న శిక్షణ

– కిలోమీటర్‌ పరిధిలోని కేంద్రాలన్నీ ఒకే చోటుకు

– బోధనా సామర్థ్యంపై సందేహాలు?




అంగన్‌వాడీ కేంద్రాలు ఇక ఆంగ్ల వాడీలుగా మారనున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల చదువుపై తల్లిదండ్రుల ఆలోచనల్లో వస్తున్న మార్పులకు పెద్ద పీట వేస్తూ ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో చిన్నారులకు విద్యాబోధనకు సర్వమూ సిద్ధం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో గత ఏడాదే ఈ తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైనా  ఆచరణకు నోచుకోలేకపోయింది. తాజాగా జిల్లాలోని పట్టణ కేంద్రాల్లో ‘ప్రీ స్కూల్‌’ ఎడ్యుకేషన్‌ అందించాలని భావించిన సర్కారు అందుకు అనుగుణంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది.

- అనంతపురం టౌన్‌



జిల్లాలో ప్రస్తుతం 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 5,126 మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలుండగా 4,082 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను మినహాయించి పట్టణాల్లో ‘ప్రీ స్కూల్‌’ ఎడ్యుకేషన్‌ అందించనున్నారు. ప్రస్తుతానికి అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, హిందూపురం, రాయదుర్గం, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, గుత్తి, తాడిపత్రి, కదిరి మునిసిపాలిటీలను ఎంపిక చేశారు.  ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే కదిరిలో రెండ్రోజులు శిక్షణ ముగియగా అనంతపురం అర్బన్‌ పరిధిలోని కార్యకర్తలకు సీడీపీఓ కార్యాలయ ఆవరణలో శిక్షణ కొనసాగుతోంది.



చిన్నారులకు ప్రత్యేక సిలబస్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు ఇంగ్లిష్‌ను సులువుగా నేర్పించడానికి ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. ఏబీసీడీలతో పాటు చిన్నచిన్న పదాలు, బొమ్మల గుర్తింపు, రెయిమ్స్‌తో కూడిన వర్క్‌బుక్‌లు వచ్చాయి. వీటిని ఆయా సీడీపీఓ కార్యాలయాల్లో ఉంచారు. అక్కడక్కడా ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయిస్తున్నారు. ఇక కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చేపట్టిన విధంగానే పండుగలు, ప్రత్యేక రోజులను కూడా నిర్వహించాలన్న ఆదేశాలు ఉన్నాయి.



ఒకే చోటుకు మూడు కేంద్రాలు

ప్రస్తుతం కిలోమీటర్‌ పరిధిలోపు ఉన్న మూడు అంగన్‌వాడీ కేంద్రాలను ఒక చోట చేర్చి తరగతులు ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే కేంద్రాల సంఖ్య, చిన్నారుల సంఖ్యతో అధికారులు నివేదిక తయారు సిద్ధం చేశారు. ఎన్ని విలీనం అవుతాయన్న దానిపై స్పష్టత లేదు కానీ, ఈ వివరాలను మాత్రం ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వయస్సు, విద్యార్హతను బట్టి పిల్లలకు బోధించేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలను కేటాయించనున్నారు. కాగా మూడు కేంద్రాలను ఓ చోట చేరిస్తే సెంటర్లకు వచ్చే పిల్లలు, గర్భిణులు, బాలింతల సంఖ్య తగ్గుతుందన్న భావన వ్యక్తమవుతోంది.  



అమలుపై సందేహాలు?

నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు పాఠాలను బోధించే సామర్థ్యం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి అంగన్‌వాడీ కార్యకర్తలకు పదో తరగతి విద్యార్హత ఉండాలి. కొన్ని చోట్ల పదో తరగతి ఉత్తీర్ణత కాని వారు కూడా ఉన్నారు. ఈ  నేపథ్యంలో ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశపెడుతుండడంతో ఆ మేరకు పిల్లలకు వారు బోధించగలరో లేదో అన్న సందేహం వ్యక్తమవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలను ఒక చోటుకు చేర్చాక ముగ్గురు కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. వారిలో విద్యార్హతలను బట్టి తరగతులు చెప్పేలా చర్యలు తీసుకోనున్నారు.  

 

పిల్లల సంఖ్య పెరుగుతుంది

అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించడం వల్ల పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తమ పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవాలన్న తల్లిదండ్రుల ఆశ కూడా నెరవేరుతుంది. కేంద్రాల విలీనానికి సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు పంపాం. చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని అధిగమించి తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేరుస్తాం.

- ఉషాఫణికర్, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ



సెమిస్టర్‌ వారీగా తరగతులు

ఇంగ్లిష్‌లో పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించడంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నాం. చిన్నారుల కోసం సులువైన సిలబస్‌ను రూపొందించారు. సెమిస్టర్‌ వారీగా తరగతులు జరుగుతాయి. కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన ఉంటుందనడంలో సందేహం లేదు. సెంటర్లకు త్వరలోనే టీవీలు కూడా వస్తాయి. ప్రత్యేకంగా రైమ్స్, స్టోరీలు ఇన్‌స్టాల్‌ చేసిన పెన్‌డ్రైవ్‌లు అందిస్తాం. త్వరలోనే పిల్లలకు దుస్తులు, షూలు వస్తాయన్న ఆదేశాలు ఉన్నాయి. నిరుపేద చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలు వరంకానున్నాయి.

- రాజేశ్వరి, జిల్లా కన్సల్టెంట్‌ 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top