విద్యుత్‌ డీఈ చీకటి లీలలు

విద్యుత్‌ డీఈ చీకటి లీలలు - Sakshi

– సంస్థ లారీ డ్రైవర్‌ భార్యతో వివాహేతర సంబంధం

– ఆమె పేరుతో వాహనాలు కొని డీఈ, ఏడీఈలకు అద్దెకు పెట్టిన డ్రైవరు

– నిబంధనకు విరుద్ధమైనా ఓకే చెప్పిన ఆపరేషన్స్‌ ఇంజినీరు

– విషయం తెలిసి భార్యపై దాడి చేసిన భర్త

– భర్తపై కేసు పెట్టి భార్య

– ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్‌ తల్లిదండ్రులు

– బజారున పడిన ఇంజినీర్ల పరువు

 

కర్నూలు (రాజ్‌విహార్‌): విద్యుత్‌ శాఖలో (ఎస్‌పీడీసీఎల్‌) ఓ డివిజన్‌ డీఈ జరుపుతున్న వివాహేతర సంబంధం ఇంజినీర్ల పరువును బజారున పడేసింది. సంస్థకు చెందిన లారీ డ్రైవరు భార్యతో ఓ ఆపరేషన్స్‌ విభాగం డీఈ జరుపుతున్న  చీకటిలీలలు అలస్యంగా వెలుగులోకి రావడంతో అందరికీ తలవొంపులు తెచ్చింది. ఆదర్శంగా ఉండాల్సిన డివిజన్‌ స్థాయి అధికారే ఇలాంటి గలీజ్‌ పనులు చేయడంపై అందరూ అస్యహించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన  డ్రైవర్‌,  అక్రమ సంబంధంపై భార్యను నిలదీసి గొడవపడినట్లు సమాచారం. ఈ కారణంగా ఆమె తన భర్త   కొట్టాడని సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వాహనాల అద్దె విషయంలో ఓ డైరక్టరు సూచించిన ఆదేశాలను సైతం డీఈ పాటించకుండా ఆ డ్రైవర్‌ భార్యకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

– నిబంధనలకు విరుద్ధంగా..

సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న వాహనాలు విద్యుత్‌ అధికారులు అద్దెకు వాడరాదనే నిబంధన ఉంది. అయితే ఓ ఆపరేషన్స్‌ డీఈ సంస్థకు చెందిన లారీ డ్రైవర్‌కు ఎర్ర తివాచి పరిచారు. దీంతో ఆ డ్రైవర్‌ తన భార్య పేరుతో ఓ వాహనం కొని అద్దె ప్రతిపాదికన ఏకంగా డీఈకి పెట్టారు. అక్కడి నుంచి పరిచయం పటిష్టమవడంతో ఆయన మరో వాహనం కొనుగోలు చేసి ఏడీఈకి కూడా పెట్టారు. అంతటితో ఆగకుండా మరో వాహనం కొనుగోలు చేసి పక్క సబ్‌ డివిజన్‌లోని ఏడీఈకి కూడా పెట్టించాలని కోరడంతో అందుకు డీఈ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా చేతివాటం ప్రదర్శించి డీఈ హద్దులు దాటారని తెలుస్తోంది.

 

– మలుపులు తిరిగిన కథ:

తన భార్యతో డీఈ వ్యవహరిస్తున్న తీరును గమనించిన డ్రైవరు అనుమానం వచ్చి  నిలదీశాడు. ఈ సందర్భంగా జరిగిన గొడవకు ఆమె సమీప పోలీసు స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది. ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డ్రైవరు తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి.. ఆ డీఈ తన కోడుకు, కోడలి పట్ల వ్యవహించిన తీరు, చేసిన దుర్మార్గ  పనులను వివరించినట్లు సమాచారం. కాగా ఆ డీఈతో ఓ జిల్లా స్థాయి అధికారికి ఉన్న అనుబంధం కారణంగా ఎలాంటి చర్యలు సిఫార్సు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఆ డ్రైవరు బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది.

 

– బజారులో ఇంజినీర్ల పరువు:

ఓ ఆపరేషన్స్‌ డీఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు వాడుకోవడంతోపాటు లారీ డ్రైవర్‌ భార్య పట్ల వ్యవహరించిన తీరు సిగ్గు చేటని  ఇంజినీర్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి అధికారుల వైఖరి వల్ల తమకు సమాజంలో పరువు లేకుండా పోతుందని చర్చించుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ఎలాంటి మద్దతు ఇవ్వరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top