
‘డబుల్’కు ట్రబుల్..!
సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆదిలోనే పెద్ద చిక్కువచ్చింది.
రెండు పడక గదుల ఇళ్లకు భారీగా ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లు
ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్‌లో ఇళ్లు కట్టలేమని వెల్లడి
చదరపు అడుగు వ్యయం రూ.946కు లోపే ఉండాలన్న సర్కారు
వరంగల్, పాలమూరులలో రూ.1,150కు మించి కొటేషన్లు
సాక్షి, హైదరాబాద్: సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆదిలోనే పెద్ద చిక్కువచ్చింది. దసరాకు రాష్ట్రవ్యాప్తంగా ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్న సర్కారుకు వరంగల్, మహబూబ్‌నగర్‌లలో చేపట్టిన తొలి టెండర్లలోనే సమస్య ఎదురైంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ధరకన్నా కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేశారు. ఐదు లక్షల్లో ఇళ్లు కట్టలేమని తేల్చారు. దీంతో ఆ టెండర్లను రద్దు చేసిన సర్కారు.. మళ్లీ టెండర్లు పిలిచింది. ఈసారీ ప్రతిపాదిత ధరతో నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏడాదిన్నరగా తర్జనభర్జన..:
రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని పట్టాలెక్కించేందుకు ఏడాదిన్నర పాటు తర్జనభర్జన పడిన ప్రభుత్వం... ఇటీవలే అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా కొన్ని బస్తీలకు ‘డబుల్’ ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానిప్రకారం 1,384 ఇళ్లను మంజూరు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జీ+1 పద్ధతిలో 792 ఇళ్లు, జీ+3 పద్ధతిలో 592 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దసరాకు ‘డబుల్’ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో... వరంగల్ ఇళ్ల కోసం ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ పథకానికి పిలిచిన తొలి టెండర్లు ఇవే. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా యూనిట్ కాస్ట్‌ను ఖరారు చేశారు. ఈ లెక్కన వరంగల్‌లో ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షలు, చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.946 అవుతుంది. అయితే తాజాగా ఆ టెండర్లు తెరిచిన అధికారులు అవాక్కయ్యారు.
కాంట్రాక్టర్లు జీ+1 పద్ధతిలో నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,200కు మించి కోట్ చేశారు. అదే జీ+3కి రూ.1,000 వరకు కోట్ చేశారు. ఈ లెక్కన నిర్మిస్తే ఒక్కో ఇంటికయ్యే వ్యయం రూ.ఆరున్నర లక్షలను మించుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక వరంగల్ ఆర్‌అండ్‌బీ అధికారులు హైదరాబాద్‌కు పరుగెత్తుకు వచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించడంతో విషయం సీఎం వరకు వెళ్లింది. ప్రభుత్వం నిర్ధారించిన యూనిట్‌కాస్ట్ మేరకే నిర్మాణాలు చేపట్టాలని, ఆ టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో వరంగల్ అధికారులు మళ్లీ టెండర్లు పిలిచారు. వాటిని ఈనెల 20న తెరవబోతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్మించనున్న ‘డబుల్’ ఇళ్ల టెండర్ల విషయంగానూ ఇదే పరిస్థితి ఎదురయింది. ప్రతిపాదిత ధరలోపు కొటేషన్లు రానిపక్షంలో ప్రభుత్వం యూనిట్ కాస్ట్ విషయంలో పునరాలోచించే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
పన్ను మినహాయింపుతో..
అన్ని పన్నుల నుంచి మినహాయింపు ఇస్తేగాని ప్రభుత్వం ప్రతిపాదించిన ధరకు నిర్మాణాలు సాధ్యమయ్యే అవకాశం లేదు. సాధారణంగా కాంట్రాక్టర్లు వ్యాట్ 5 శాతం, 5.60 శాతం సేవాపన్ను, 1 శాతం లేబర్ సెస్, 1 శాతం నిర్మాణ సామగ్రిపై సీనరేజిగా చెల్లించాలి. మొత్తంగా 12.60 శాతం మేర ఉండే ఈ పన్నుల నుంచి మినహాయింపుతోపాటు ఇసుకను ఉచితంగా ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ముందే చెప్పిన అధికారులు
చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.1,150లోపు ఖరారు చేస్తే కాంట్రాక్టర్లు ముందుకు రారని గృహనిర్మాణ శాఖ అధికారులు ముందుగానే ముఖ్యమంత్రికి వివరించారు. కానీ అంత ధర ఖరారు చేస్తే యూనిట్‌కాస్ట్ భారీగా పెంచాల్సి వస్తుందని, రూ. 900కు మించొద్దని సీఎం సూచించారు. దీంతో అదే ధరను పేర్కొంటూ టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్లు చదరపు అడుగుకు రూ.1,150కి పైనే కోట్ చేశారు.