కళాశాల స్థలాన్ని రక్షించాలని ధర్నా
రోడ్డు విస్తరణ పనుల పేరుతో కేవీఆర్ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఆ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు హెచ్చరించారు.
కర్నూలు(న్యూసిటీ) : రోడ్డు విస్తరణ పనుల పేరుతో కేవీఆర్ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఆ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు హెచ్చరించారు. గురువారం సాయంత్రం కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ విద్యార్థినులు, అధ్యాపకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వచ్చి కళాశాల స్థలం ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతానని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. రోడ్డు విస్తరణ కోసం 12 మీటర్లను తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కొందరు షాపింగ్ కాంప్లెక్స్ కోసం 28 మీటర్ల స్థలాన్ని తీసుకొని ఆట స్థలం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అధ్యాపకురాలు ఇందిరాశాంతి ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాల స్థలాన్ని కాపాడతామని, అవసరమైతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హైకోర్టులో కేసు వేయిస్తామని హెచ్చరించారు. మునిసిపల్ అధికారులు రాజకీయ నాయకులకు అనుకూలంగా ప్రభుత్వ స్థలాలను వారికి అప్పజేప్పేందుకు చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.