నోట్ల రద్దుతో అభివృద్ధి వెనక్కి | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో అభివృద్ధి వెనక్కి

Published Fri, Dec 30 2016 10:35 PM

నోట్ల రద్దుతో అభివృద్ధి వెనక్కి - Sakshi

ప్యాపిలి: పెద్ద నోట్ల రద్దుతో దేశ అభివృద్ధి ఆగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టణ సమీపంలో బోరెడ్డి పుల్లారెడ్డి ఫ్యాక్టరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ నవంబర్‌ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నుట్లు ప్రకటించగానే పేదల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందన్నారు. పెద్ద నోట్లు మార్చుకోవడానికి కొత్తనోట్లకు చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా బీజేపీ నేతల ఇళ్లల్లో మాత్రం శుభకార్యాలు అంగరంగ వైభవంగా సాగడంతో మతలబు ఏమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు వ్యవహారంలో పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవరికీ లేదని 2019లో తిరిగి కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.

    వచ్చే నెల 11న మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహావిష్కరణకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్యాపిలి రానున్నట్లు చెప్పారు. అనంతరం విగ్రహ ఏర్పాటు స్థలాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ బోరెడ్డి పుల్లారెడ్డి, ప్యాపిలి, హుసేనాపురం సింగిల్‌ విండో అధ్యక్షుడు చిన్న వెంకటరెడ్డి, సీమ సుధాకర్‌రెడ్డి, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు గడ్డం భువనేశ్వరరెడ్డి, న్యాయవాది నాగభూషణంరెడ్డి,  సీనియర్‌ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, బోరెడ్డి రాము పాల్గొన్నారు.  

Advertisement
Advertisement