సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ జపం మానుకోవాలని, విదేశీ కంపెనీలకు భూములు ధారాదత్తం చేసే వైఖరిని వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు.
విజయవాడ (గాంధీనగర్) : సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ జపం మానుకోవాలని, విదేశీ కంపెనీలకు భూములు ధారాదత్తం చేసే వైఖరిని వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. రాజధాని ప్రాంత భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టవద్దంటూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించే సమయంలో రాష్ట్ర రాజధానికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు.
అయినప్పటికీ కేంద్ర సహకారం తీసుకుని రాజధాని నిర్మాణం చేపట్టకుండా ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలు సమీకరించారన్నారు. ఆ విధంగా సమీకరించిన వేలాది ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి తెచ్చిన వందల కోట్ల నిధులకు లెక్కచెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. నిధులకు సంబంధించి కనీసం యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
భూముల్లో నాలుగువేల ఎకరాల ప్రైమ్‌ల్యాండ్ అంతా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా సింగపూర్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వేలాది ఎకరాల భూమిని వారికి కట్టబెట్టి 25 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రభుత్వానికి ఏమాత్రంఅధికారం లేకుండా చేస్తున్న కంపెనీల వైఖరిని ఎండగట్టారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతోనే రాజధానిని నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వర్గాలకు కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి వామపక్ష పార్టీలన్నీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పోరాటానికి సమాయత్తం అవుతున్నట్లు పేర్కొన్నారు.