
ప్రత్యేక ప్యాకేజీపై బొజ్జల సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ముందు లాభపడేది టీడీపీయేనని, ఆ తర్వాత ఆంధ్రులని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెనాలి : ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ముందు లాభపడేది టీడీపీయేనని, ఆ తర్వాత ఆంధ్రులని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఏర్పాటు చేసిన ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఇవ్వటానికి అంగీకరించినట్లు సమాచారం ఉందన్నారు. ఇంకా ఎక్కువ ఇచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు యాచించటానికైనా, దోచిపెట్టడానికి కూడ వెనుకాడబోమన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు, భూ ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.