బసవా.. సీటు వదలవా?

బసవా.. సీటు వదలవా? - Sakshi

- 11 ఏళ్లుగా ఒకేచోట విధులు

- నెల కిందట బదిలీ అయినా వెళ్లని వైనం

- అధికార పార్టీ అండదండలున్నాయనే ధీమా

- రెవెన్యూ కార్యాలయంలో ఆర్‌ఐ హల్‌చల్‌

డీ.హీరేహాళ్‌ : భూముల బదిలీలతో రైతుల మధ్య విభేదాలు సృష్టించడమే కాకుండా ప్రతి పనికీ డబ్బు వసూలు చేస్తూ ప్రజల్లో ఏహ్యభావం పెంచుకున్న ఆ ఆర్‌ఐ తనను మరోచోటికి బదిలీ చేసినా సీటు వదలడం లేదు. అధికార పార్టీ అండదండలు ఉన్నందున తననెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో దర్జాగా కార్యాలయంలోనే తిరుగుతూ ‘సొంత’ పనులు చక్కబెట్టుకుంటున్నారు.  

    ఓబుళాపురం గ్రామానికి చెందిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్‌ఐ) బసవకుమార్‌ పదకొండేళ్లుగా డి.హీరేహాళ్‌ మండలంలో విధులు నిర్వర్తించారు. ఈయన వద్దకు పనిపైనా వెళ్లే వారెవరైనా కాసులు ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ముప్పుతిప్పలు పెట్టేవాడని బాధితులు వాపోతున్నారు. భూములను సైతం ఒకరి పేరుపై ఉన్నవి మరొకరి పేరుపై బదలాయించి.. కోర్టుల వరకు వెళ్లేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. బసవకుమార్‌ గత నెల 12న కలెక్టరేట్‌కు బదిలీ అయ్యాడు. ఈ మేరకు రిలీవ్‌ చేసినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటనారాయణ తెలిపారు. అయితే కార్యాలయం వదలకుండా ప్రతి రోజూ వచ్చి వెళుతున్నాడు. తనకు కావలసిన వారి పనులను పాత తేదీలతో చేసి పెడుతున్నాడు. 

మా భూములను వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించలేదు

పులకుర్తి పొలంలో సర్వేనంబర్‌ 551లో 4.97 ఎకరాలకు గాను 2.97 ఎకరాలు మాత్రమే నమోదు చేశారు. మరో 2 ఎకరాలు ఎక్కించాలని, వాటికి ఆధారాలు కూడా చూపించాము. అయినా కార్యాలయం చుట్టు తిప్పుకుంటున్నారు. ఆర్‌ఐ బసవకుమార్‌ వల్లే మాకు ఈ బాధలు.  

– పెన్నయ్య, మల్లికేతి

 

భూములనే మార్చేసిన ఘనుడు 

యాభై ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేశాం. వాటిని రిజిష్టర్‌ కూడా చేయించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే సాగుచేసుకుంటున్నాం. ఆ భూములను ఒక స్టోర్‌ డీలర్‌ పేరుమీద మార్చేసి మమ్మల్ని ఇబ్బందిపాలు చేశారు. కోర్టులో కేసులు వేసి, తిరుగుతున్నాం. ఇలాంటి అధికారులతో రైతులకు ఇబ్బందే.

– వన్నూరప్ప, హడగలి 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top