
బడి ‘స్వచ్ఛత’కు అవార్డులు
‘స్వచ్ఛ విద్యాలయ’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించే పాఠశాలలకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తోంది.
– ఆరోగ్యకరమైన విద్యార్థులే లక్ష్యంగా స్వచ్ఛ విద్యాలయ
– జాతీయస్థాయికి ఎంపికైతే రూ. 50 వేలు పురస్కారం
– దరఖాస్తుకు అక్టోబరు 31 గడువు
‘స్వచ్ఛ విద్యాలయ’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించే పాఠశాలలకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తోంది. ఇందుకోసం ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డులను ప్రకటించింది. పరిశుభ్రత పాటించే ప్రతి పాఠశాల ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. గతేడాది (2016–17 విద్యా సంవత్సరం) కొడిగెనహల్లి ఏపీఆర్ స్కూల్ జాతీయస్థాయి ‘స్వచ్ఛ విద్యాలయ పురస్కార్’కు ఎంపికై, రూ. 50 వేలు పురస్కారాన్ని అందుకున్న వైనం విదితమే. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యకరమైన విద్యార్థులను తయారు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమంటూ దేశ ప్రధాని మోదీ ప్రకటించారు.
- అనంతపురం ఎడ్యుకేషన్
ప్రైవేట్ పాఠశాలలకూ అవకాశం
స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు గతేడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల నుంచే దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు swachh vidyalaya puraskar అనే మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా 070972 98093 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా swachh vidyalaya puraskar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లో ముందుగా స్కూల్ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సమయంలో ఏ మొబైల్ నంబర్ ఇస్తున్నారో.. అదే నంబర్‌కు ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్) వస్తుంది. ఇదే ఆ పాఠశాల పాస్‌వర్డ్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ అని ఉన్న చోట క్లిక్ చేయగానే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వద్ద పాఠశాల యూడైస్ కోడ్ టైప్ చేయాలి. ఓటీపీ నంబర్‌ను పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత 39 ప్రశ్నలు కనిపిస్తాయి. వీటన్నింటికి సమాధానాలతో పాటు సంబంధిత ఫొటోలు కూడా అప్‌లోడ్ చేయాలి. ఆయా పాఠశాలలు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంది.
ఎంపిక ఇలా...
అన్ని పాఠశాలలను రూరల్, అర్బన్ కేటగిరీలుగా విభజించారు. రూరల్‌లో మూడు, అర్బన్‌లో మూడు స్కూళ్లను జిల్లాస్థాయి అవార్డులకు ఎంపిక చేస్తారు. ఇక్కడ ఎంపికైన తర్వాత జిల్లాస్థాయి కమిటీ సభ్యులైన డీఈఓ, ఎస్‌ఎస్‌ఏ పీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ తదితరులు క్షేత్రస్థాయిలో ఆయా పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తారు. దరఖాస్తులో కనబరిచిన అన్ని అంశాలూ ఉన్నాయా..లేదా అని ధ్రువీకరించుకున్న తర్వాత రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.