ఏదీ లోపించినా నష్టమే | Sakshi
Sakshi News home page

ఏదీ లోపించినా నష్టమే

Published Mon, Oct 3 2016 1:22 AM

ఏదీ లోపించినా నష్టమే

– వరిలో పోషకాల ప్రాధాన్యంపై నిపుణుల అభిప్రాయం 
– డాట్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ సుజాతమ్మ సూచనలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌) : 
మొక్కల సమర్థ పెరుగుదల, అధిక దిగుబడికి అనేక రకాల పోషకాలు అవసరం. ఉదజని, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాష్‌ తదితర ప్రధాన పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం, గంధకంలాంటి ద్వితీయ పోషకాలతోపాటు ఇనుము, మాంగనీసు, కాపర్, జింక్, బోరాన్, క్లోరిన్‌ మొదలైన సూక్ష్మపోషకాలు వరి పంటకు అవసరం. ఇవన్ని కావాల్సినంతగా పైరుకు అందితేనే ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.సుజాతమ్మ(99896 23810) తెలిపారు. వరిలో పోషకాల లోపం, నివారణపై ఆమె రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.  
– నత్రజని.. పంట పెరుగుదల, పిలకల సంఖ్య, వెన్నులో గింజలవద్ధి, మాంసకత్తుల తయారీలో కీలకం. ఇదిలోపిస్తే ముందుగా ముదురు ఆకులు తర్వాత పైరంతా పసుపు రంగుకు మారుతుంది. పైరు పెరుగుదల తక్కువగా ఉండి గిడసబారుతుంది. నివారణ కోసం ఎకరాకు 92 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి విత్తు, దుబ్బు, అంకురం దశలో అందించాలి. 
– భాస్వరం .. వేర్ల పెరుగుదల, జీవ రసాయన ప్రక్రియలు, గింజ పరిపక్వతకు ఇది అవసరం. దీనిలోపంతో  వేర్లు, మొక్కల పెరుగుదల తగ్గి ఆకులు సన్నగా, చిన్నగా కనిపిస్తాయి. నివారణకు సేంద్రీయ ఎరువులతో పాటు సిఫారసు మేరకు ఎకరాకు 32 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి.
– పొటాషియం.. చీడపీడలు, చలి తట్టుకుని మొక్కలు దఢంగా, బలంగా పెరిగి గింజలు నిండుగా రావడానికి పొటాషియం తోడ్పడుతుంది. దీనిలోపంతో ఆకుల అంచులు గోధుమ రంగుకు మారి మచ్చలు ఏర్పడతాయి. చివర్లు అంచుల నుంచి ఎండిపోతాయి. లోపాల సవరణకు వరిగడ్డి లాంటి పంట వ్యర్థాలు వాడుతూ సిఫారసు మేరకు ఎకరాకు 32 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను బరువు నేలల్లో దమ్ములో, తేలిక నేలల్లో దమ్ములో సగం, మిగిలిన సగం చిరుపొట్ట దశలో వేయాలి. 
– గంధకం .. పత్రహరిత నిర్మాణంలో కిరణజన్య సంయోగక్రియ, అమైనో ఆమ్లాల తయారీలో గంధకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇదిలోపిస్తే  లేత ఆకులు పచ్చదనాన్ని కోల్పోతాయి. పిలకలు తగ్గి మొక్కలో పెరుగుదల లోపిస్తుంది. సవరణకు సేంద్రీయ ఎరువులు, గంధకం కల్గిన రసాయన ఎరువులను దమ్ములో వేసుకోవాలి.  
 

Advertisement
Advertisement