
క్యాపిటల్ రీజియన్‌లో ప్రతిపాదిత ఔటర్ రింగ్‌రోడ్డు (నలుపు రంగు వృత్తం)
అమరావతి ఔటర్ రింగు రోడ్డును రూ. 20 వేల కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
నాలుగు దశలు.. 210 కిలోమీటర్లు
కృష్ణానదిపై రెండుచోట్ల వంతెనలు
కేంద్రం నిధులు ఇస్తామన్నా బేఖాతరు
విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు యత్నాలు
ప్రస్తుతం గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
భూసేకరణ ద్వారా భూమిని సేకరించేందుకు నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: అమరావతి ఔటర్ రింగు రోడ్డును రూ. 20 వేల కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ప్రణాళిక రూపొందించగా తొలి దశను 2017 సంవత్సరానికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం త్వరలో సవివర నివేదిక పూర్తి చేసి నిర్మాణ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చినా, విదేశీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం!
దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్టు వల్ల బాగా లాభం పొందవచ్చని చెబుతూ సింగపూర్, చైనా, జపాన్, బ్రిటన్ దేశాలకు చెందిన పలు కంపెనీలకు ఆఫర్లు ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు సవివర నివేదిక ఇస్తే ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే రాష్ట్రప్రభుత్వం కేంద్ర సాయంతో విదేశీ కంపెనీలకు ఈ ప్రాజెక్టు అప్పగించాలనే యోచనలో ఉంది. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలతో దీనిపై సీఆర్‌డీఏ అధికారులు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్), బీఓటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) విధానాల్లో ఒక దాని ద్వారా ప్రాజెక్టును వాటికి ఇచ్చేందుకు సమాలోచనలు జరుపుతోంది.
నాలుగు దశలు
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 210 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డును నాలుగు దశల్లో చేపట్టనుంది. 51.6 కిలోమీటర్లను మొదటి దశ రోడ్డును 2017 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. రెండో దశలో 66.7 కిలోమీటర్లను 2020 నాటికి, మూడో దశలో 41.6 కిలోమీటర్లను 2023 నాటికి, నాలుగో దశలో 50.2 కిలోమీటర్లను 2026 నాటికి నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ఈ రోడ్డులో భాగంగా కృష్ణానదిపై రెండుచోట్ల భారీ వంతెనలు నిర్మించాల్సివుంది.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు, గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట మధ్య ఒక వంతెన, గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐలూరు మధ్య మరో వంతెన నిర్మించాల్సివుంది. ఈ వంతెనలు రెండింటినీ రెండు ప్యాకేజీలుగా, మిగిలిన పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 7,784 ఎకరాలను సేకరించాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ గ్రామాల గుండా..
కృష్ణా జిల్లాలోని మున్నలూరు, మొగులూరు, పేరికలపాడు, జమ్మవరం, తిమ్మాపురం, దుగ్గిరాలపాడు, మైలవరం, గణపవరం, మల్లేశ్వరం, ఆగిరిపల్లి, సగ్గూరు, సురవరం, అంపాపురం, తేలప్రోలు, పొట్టిపాడు, కొయ్యగూరపాడు, వేమండ, గోపువానిపాలెం, తాడంకి, వీరంకి, ఐలూరు గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు.
గుంటూరు జిల్లాలో అన్నవరం, కుచ్చెళ్లపాడు, వరాహపురం, పోతమర్రు, పెదగాదెలపర్రు, చేబ్రోలు, కొర్నిపాడు, పేరేచర్ల, చినమక్కెన, లింగంగుంట్ల, జలాల్‌పురం, ధరణికోట గ్రామాల మధ్య రోడ్డు నిర్మితమవుతుంది. ఏ గ్రామాల్లో, ఎంత మేర భూమిని సేకరించాలనే దానిపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఈ భూమిలో 80 శాతానికిపైగా భూసేకరణ ద్వారా సేకరించడానికి సమాయత్తమవుతోంది. మిగిలిన దాన్లో కొంత అటవీ భూమి ఉండగా, కొంత రాజధాని కోసం సమీకరణ ద్వారా సేకరించిన భూమిని వినియోగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో ఈ ప్రాజెక్టుపై సవివర నివేదికను రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.