
పోరాడి సాధించింది..!
పదవ తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏ ర్యాంకు పొందిన ఓ విద్యార్థిని ఎస్‌ఎస్‌సీ బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా మళ్లీ అవే మార్కులు వచ్చాయని పంపారు.
ఎస్‌ఎస్‌సీ రీవాల్యుయేషన్‌లో సైతం పాత మార్కులే
త్రిసభ్య కమిటీ నివేదికలో 10/10 సాధించిన వైనం
భట్టిప్రోలు : పదవ తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏ ర్యాంకు పొందిన ఓ విద్యార్థిని ఎస్‌ఎస్‌సీ బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా మళ్లీ అవే మార్కులు వచ్చాయని పంపారు. అయితే తనపై తనకు అంచచల విశ్వాసమున్న ఆ విద్యార్థిని అంతటితో తన ఖర్మ అంతేలే అని ఊరుకోలేదు.
రీవాల్యుయేషన్‌లో కూడా తప్పు జరిగిందంటూ మళ్లీ ఎగ్జామినేషన్ బోర్డును ఆశ్రయించింది. ముచ్చటగా మూడోసారి ఆ బాలిక సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసి చివరకు బోర్డు 10కి10 జీపీఎ ర్యాంకు ఖరారు చేసి పంపింది. విజయగర్వంతో ఆ బాలిక వదనంపై చిరు దరహాసం మెరిసింది.
వివరాలలోకి వెళితే భట్టిప్రోలుకు చెందిన అల్లం వెంకట్రావు కుమార్తె అల్లం భావన ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసింది. మొదటి నుంచి భావన చదువులో మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల స్థాయి నుంచి ప్రథమురాలుగా నిలిచేది. అయితే పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏ రావడంతో హతాశురాలైంది.
బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయగా పరీక్షల్లో 5 సబ్జెక్ట్‌ల్లో 10కి10 జీపీఎ మార్కులు రాగా సోషల్ సబ్జెక్ట్‌లో 9 జీపీఎ మార్కులు వచ్చినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ఇంటికి సమాధాన పత్రాలను పంపింది. ఒక పేపర్‌లో 46 మార్కులు మరొక పేపర్‌లో 45 మార్కులు వేశారు.
ఈ సమాధాన పత్రాలను సోషల్ ఉపాధ్యాయులకు చూపగా రెండు మార్కుల ప్రశ్నలకు అన్నింటికీ రైట్‌లు కొట్టి అందులో ఒకదానికి రెండు మార్కులు వేసి కొట్టివేసి ఒక మార్కు వేశారని 4 మార్కుల ప్రశ్నల్లో నాలుగింటికి 12 మార్కులు వేయగా అందులో ఒక ప్రశ్నకు 4 సమ ప్రశ్నలకు గాను 4 సమాధానాలు సరైన సమాధానాలుగా మూల్యాంకం చేసి 4 మార్కులు ఇవ్వాల్సి ఉండగా 3 మార్కులు ఇచ్చారని చెప్పారు. ఇక్కడ తగ్గిన ఒక మార్కు కారణంగా 10 కి 10 జీపీఏ ర్యాంకు కోల్పోయింది. మళ్లీ రీ అప్పీలుకు దాఖలు చేస్తే త్రిసభ్య కమిటీ పరిశీలించాలని తెలిపారు.
ఎట్టకేలకు పరిశీలించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు దొర్లిన తప్పును సరిచేసి ఈ నెల 9వ తేదీన ఎ2 గ్రేడ్ నుంచి ఎ1 గ్రేడ్‌కు మార్చి ఉత్తర్వులు పంపినట్టు భావన తండ్రి వెంకట్రావు తెలిపారు.