2వ తేదీకి 200 ఆత్మగౌరవ గ్రామాలు

2వ తేదీకి 200 ఆత్మగౌరవ గ్రామాలు - Sakshi

మచిలీపట్నం (చిలకలపూడి) : గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ రెండో తేదీ నాటికి జిల్లాలో 200 గ్రామాల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మించి ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బాబు.ఎ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు, డీఆర్వో సీహెచ్‌ రంగయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని, పదిలోపు మరుగుదొడ్లు నిర్మించాల్సిన గ్రామాలు 90 ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా త్వరితగతిన పూర్తిచేసి అక్టోబర్‌ రెండో తేదీ నాటికి 200 ఆత్మగౌరవ గ్రామాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇందుకు మరో ఎనిమిది రోజుల సమయమే ఉన్నందున త్వరితగతిన పూర్తిచేయాలని ప్రత్యేకాధికారులకు సూచించారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ఆయా మండలాల్లో పర్యటించి వాటి నివేదికలు పంపాలన్నారు. ప్రతి నెలా 4వ శనివారం పాఠశాలల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. ఉపాధి పథకం పనులకు సంబంధించి కూలి మొత్తం కూలీల ఖాతాల్లోకి జమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌వాడీ భవనాల్లో చిన్నారులకు పోషకాహారాలు పూర్తిస్థాయిలో అందజేస్తున్నట్లు నివేదికలు ఇస్తున్నా పిల్లలను బలహీనంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల తాను ఢిల్లీలో స్త్రీ, శిశుసంక్షేమశాఖ కార్యదర్శిని కలిసి, అక్కడి నుంచి వచ్చిన సూచనలను జిల్లాలో పాటించాలని చెప్పినా స్పందించని ఐసీడీఎస్‌ పీడీ కృష్ణకుమారికి మెమో జారీ చేయాలని డీఆర్వోకు సూచించారు. మండలాల్లో పర్యటించే ప్రత్యేకాధికారులు ఉపాధి హామీ పనులు, పారిశుద్ధ్యం, గృహనిర్మాణాల పురోతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు. గృహనిర్మాణశాఖ ద్వారా జిల్లాకు మంజూరైన 16వేల గృహాలు 60 రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు.  జెడ్పీ సీఈవో టి.దామోదరనాయుడు, డీఎస్‌వో వి.రవికిరణ్, సీపీవో కె.వి.కె.రత్నబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో ఆర్‌.నాగమల్లేశ్వరి, డ్వామా పీడీ మాధవీలత, హౌసింగ్‌ పీడీ వి.శరత్‌బాబు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు వెంకటేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ జేడీ పి.ఎస్‌.ఎ.ప్రసాద్, మత్స్యశాఖ డీడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top