
జమాల్‌బాషా(ఫైల్)
గోస్పాడు: ప్రత్యేకహోదా రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లెల్లకు చెందిన జమాల్‌బాషా(27)కు ఏడాది క్రితం ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన హరిఫాతో వివాహమైంది. డిగ్రీ చదివినా ఏ ఉద్యోగమూ రాకపోవడంతో సెల్‌ఫోన్లు మరమ్మతు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే చాలీచాలని సొమ్ముతో జీవనం సాగించడం కష్టమైందని నిత్యం సతమత మవుతుండేవాడు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే తన లాంటి చదువుకున్న వారికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేదని, కనీసం ప్రైవేటు ఉద్యోగమైనా చేసుకునేవాడినని తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య హరిఫా చెబుతోంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వాపోయింది. ఇదే విషయమై గోస్పాడు ఎస్‌ఐ నరేష్‌ను అడగ్గా.. మృతదేహం వద్ద తమకు ఎలాంటి లేఖ లభ్యం కాలేదని చెప్పారు. జమాల్‌బాషా భార్య చెబుతున్న సూసైడ్ నోట్‌పై అనుమానాలు ఉన్నాయన్నారు.