రైలు ఢీకొని వివాహిత మృతి

Wife Dead Husband Injured in Train Accident Visakhapatnam - Sakshi

ప్రాణాపాయ స్థితిలో భర్త

నూజివీడు రైల్వేస్టేషన్‌లో దుర్ఘటన

ట్రాక్‌ దాటుతుండగా ప్రమాదం

అక్కడికక్కడే భార్య దుర్మరణం

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త

విశాఖపట్నం, హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం) : ఎంతో హుషారుగా అత్తారింటికి బయలుదేరిన నవ దంపతుల పాలిట రైలు మృత్యు శకటంగా మారింది. మరొక్క అడుగు దూరంలో ప్లాట్‌ఫాంపైకి ఎక్కబోతున్న దంపతులు రెప్పపాటులో ఘోర ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వస్తున్న రైలును గుర్తించకుండా పట్టాలు దాటుతున్న యువ జంట ప్రాణాలపైకి తెచ్చుకుంది. ఈ  ప్రమాదంలో యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆమె భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. చూపరులు, తోటి ప్రయాణికులకు హృదయ విదారకంగా మారిన ఈ దుర్ఘటన హనుమాన్‌జంక్షన్‌ (నూజివీడు) లోని రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... విశాఖ జిల్లా అనంతగిరి మండలం పెద్దబిడ్డ గ్రామానికి చెందిన మంజుల (19)కు ముసునూరు మండలం సూరేపల్లికి చెందిన పాలకుర్తి కృపావరంతో ఇటీవల వివాహం జరిగింది. భవన నిర్మాణ కార్మికుడైన కృపావరంతో ప్రేమలో పడి తల్లిదండ్రులను సైతం ఒప్పించి మంజుల పెళ్లి చేసుకుంది.

కాగా ఇటీవల అత్తగారింటికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో నవ దంపతులిద్దరూ ఎంతో హుషారుగా మంగళవారం ఇంటి నుంచి బయలుదేరారు. రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు ఇక్కడి రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రైల్వే ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జిపై ఆటోలో దిగిన మంజుల, కృపావరం నడుచుకుంటూ రెండో నంబరు ప్లాట్‌ఫాంపైకి చేరుకున్నారు. ఇంతలో రాయగడ ఎక్స్‌ప్రెస్‌ 1వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వస్తుందని తెలుసుకుని అవతలి వైపుకి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు వేగంగా వచ్చి ఢీకొంది. కేవలం ఒక్క అడుగు దాటితే ప్లాట్‌ఫాం ఎక్కే అవకాశం ఉన్న తరుణంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటనలో మంజుల అక్కడికక్కడే మృతి చెందగా, భర్త కృపావరం తల, కాళ్లకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించటంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కృపావరాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అపస్మారక స్థితి నుంచి బుధవారం సాయంత్రం కృపావరం బయటకు వచ్చాడు. తన భార్య మంజుల గూర్చి ఆరా తీసినప్పటికీ కృపావరం ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు ఇంకా చెప్పలేదు. ఈ దుర్ఘటనపై ఏలూరు రైల్వే ఎస్‌ఐ కే శాంతారామ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top