ఏసీబీ వలలో వీఆర్‌ఓ

VRO Caught Red Handedly by ACB - Sakshi

రైతు నుంచి లంచంతీసుకుంటుండగాపట్టుకున్న డీఎస్పీ

వల్లూరు : ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ వల్లూరు మండలంలోని వీఆర్‌ఓ గంగమ్మ మంగళవారం ఏసీబీకి పట్టుబడింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ  నాగరాజు విలేకరుల సమావేశంలో ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పవర్‌ గ్రిడ్‌ ఆఫ్‌ ఇండియా వారు గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి కడప వరకు 765 కేవీ నూతన విద్యుత్‌ లైన్‌ను ఏర్పాటు చేయడానికి సర్వే చేస్తున్నారు. ఈ విద్యుత్‌ లైను వల్లూరు మండలంలోని గ్రామాల మీదుగా వెళ్లనుంది. దీంతో  విద్యుత్‌ లైన్లు వెళ్లే మార్గంలోని భూములు, రైతుల వివరాలను, అందులో ఉన్న పంట, ఇతర  నిర్మాణాలపై విచారణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక పంపాలని కోరుతూ పవర్‌ గ్రిడ్‌ ఆఫ్‌ ఇండియా వారు రెవెన్యూ  కార్యాలయానికి నోటీసులు అందించారు.

ఈ లైను వల్లూరు గ్రామానికి చెందిన పి. మల్లికార్జునరెడ్డికి సంబంధించిన పొలం మీదుగా పోతోంది. దీంతో ఆయన వీఆర్‌ఓ గంగమ్మను కలిసి విచారణ చేసి వివరాలను అందించాలని కోరారు. దీనికి ఆమె  రూ.5 వేలు ఇస్తేనే పని చేస్తానని తెలిపింది. పలు దఫాలు మల్లికార్జున రెడ్డి ఆమెను కలిసినప్పటికీ ఇదే విధమైన సమాధానం ఇచ్చింది. దీంతో మల్లికార్జునరెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఓ గంగమ్మ రైతు మల్లికార్జునరెడ్డి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఆకస్మికంగా  దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసిన ఈమెను  కర్నూలులోని ఏసీబీ కోర్జుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సుధాకర్‌రెడ్డి, రామచంద్ర పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top