గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు

Velpuru Temple Excavated For Treasure Hunt In Guntur District - Sakshi

వేల్పూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘటన

వేయిపడగల నాగేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూల్చిన దుండగులు

సాక్షి, వేల్పూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన మండలంలోని వేల్పూరులో గల రామలింగేశ్వరస్వామి ఆలయంలో  గురువారం రాత్రి చోటుచేసుకుంది.  ఆలయ పూజారి ఆమంచి రవికుమార్‌ ఫిర్యాదు మేరకు పురావస్తుశాఖ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య, అచ్చంపేట ఎస్‌ఐ పి.పట్టాభిరామయ్య శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో వేయిపడగల నాగేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగం కింద ఉండే పాణపట్టాన్ని పూర్తిగా కూల్చేసి భూమిలో మూడు అడుగుల లోతులో గొయ్యి తీశారు.

 స్వామివారి ఎదురుగా ఉండే నందీశ్వరుని రాతి విగ్రహాన్ని దిమ్మెపై నుంచి కింద పడేసి, ఆ ప్రదేశంలో లోతైన గొయ్యి తీసి నిధుల కోసం అన్వేషించిన ఆనవాళ్లు కనిపించాయి. దేవాలయ పరిసరాల్లో అక్కడక్కడే  గుప్త నిధుల కోసం పరిశీలించిన దాఖలాలున్నాయి. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకే సారి 101 శివాలయాలను నిర్మించి అందులో ఒకే సమయంలో 101 శివలింగాలను ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వాటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు.  

విగ్రహాల ప్రతిష్టా సమయంలో విగ్రహాల కింద బంగారు నిధులు భూస్థాపితం చేసినట్లు వదంతులు ఎప్పటి నుంచో ఉన్నాయి.  గతంలో కూడా పలు మార్లు ఇదే దేవాలయంలో తవ్వకాలు జరగడంతో దేవాలయ ప్రాంగణం  మొత్తాన్ని పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుని ఆవరణ చుట్టా ఇనుప తీగతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.  అనుమతులు లేకుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం గానీ, పరిసరాల్లో సంచరించడంగానీ నేరంగా అక్కడక్కడా బోర్డులు ఉంచారు. ఇది జరిగి సుమారు 15 సంవత్సరాల పైనే అయింది.  తిరిగి ఇన్నేళ్లకు అక్రమార్కుల కళ్లు ఆలయంపై పడటం, ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతల విగ్రహాలను కూల్చడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.  ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు అచ్చంపేట ఎస్‌.ఐ పి.పట్టాభిరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top