పిచ్చిగా ప్రేమించినందుకు... అతి దారుణంగా

US Man Accused Of Killing Pregnant Wife And Daughters - Sakshi

కొలరెడో : మనుషులు ఎంత క్రూరంగా తయారయ్యారో నిరూపించే ఘటన కొలరెడోలో చోటుచేసుకుంది. గర్భిణి అయిన భార్యను, ముద్దులొలికే కూతుళ్లను అత్యంత పాశవికంగా హత్య చేశాడో వ్యక్తి. అనంతరం వారి శవాలను మరుగుతున్న ఆయిల్‌ ట్యాంకుల్లో పడేశాడు. ఆగస్టు 13న కొలరెడోలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... కొలరెడోకు చెందిన క్రిస్టోఫర్‌ లీ వాట్స్‌, షనన్‌ వాట్స్‌ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు బెల్లా(4), సెలస్టీ (3) ఉన్నారు. ప్రస్తుతం షనన్‌15 వారాల గర్భిణి. అయితే గత సోమవారం నుంచి తన, భార్యా పిల్లలు కనిపించడం లేదని క్రిస్టోఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు క్రిస్టోఫర్‌పై అనుమానం కలిగింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి వల్లేనా..!?
మధ్య తరగతి కుటుంబానికి చెందిన క్రిస్టోఫర్‌ అనడార్కో పెట్రోలియం కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భర్తతో పాటు షనన్‌ కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను పంచుకునేది. అయితే గత రెండేళ్లుగా వీరి ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో అప్పుల పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే క్రిస్టోఫర్‌ భార్యా, పిల్లలను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం బెల్లి, సెలస్టీల శవాలను తాను పనిచేసే పెట్రోలియం కంపెనీలోని ఆయిల్‌ ట్యాంకుల్లో కుక్కిన క్రిస్టోఫర్‌, షనన్‌ శవాన్ని మరో చోట పడేశాడు.

భర్తను పిచ్చిగా ప్రేమించేది..
షనన్‌, ఆమె పిల్లల హత్యల గురించి ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. ‘షనన్‌కు భర్త అంటే ఎంతో ప్రేమ. మూడోసారి గర్భవతి అయిందని తెలిసిన తర్వాత ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. భర్తతో ఈ విషయాన్ని పంచుకున్న అనంతరం మా అందరికీ ఈ శుభవార్త చెప్పింది. ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన బెస్ట్‌ ఫాదర్‌ క్రిస్టీ ప్రేమ పంచుకునేందుకు నిక్‌(పుట్టబోయే బిడ్డకు షనన్‌ పెట్టాలనుకున్న పేరు) కూడా వస్తున్నాడంటూ ఎంత గానో మురిసిపోయింది. కానీ క్రిస్టీ మాత్రం షనన్‌ పట్ల చాలా దారుణంగా వ్యవహరించాడు. గర్భవతి అనే కనికరం లేకుండా తనని హత్య చేశాడు. ముద్దొలొలికే ఆ చిన్నారుల శవాలు కూడా చూసే వీలు లేకుండా చేశాడని’  వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top