ఉన్నావ్‌ అత్యాచార కేసులో గందరగోళం

Unnao Rape Survivor Age Report Creates Confusion - Sakshi

లక్నో : ఉన్నావ్‌ అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. బాధితురాలు మైనర్‌ కాదు.. మేజర్‌ అంటూ గతంలో వైద్యులు ఇచ్చిన నివేదికలో ఉండటంతో గందరగోళం మొదలైంది. యువతి వయసు 17గా భావించి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌పై పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జూన్‌ 2017లో వెలువరించిన ప్రాథమిక వైద్య నివేదికలో మాత్రం ఆమె వయసు 19 సంవత్సరాలుగా పేర్కొన్నారు. 

అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చాక జూన్‌ 22, 2017న ఉన్నావ్‌ పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ రేడియాలజిస్ట్‌ ఎస్‌ జోహ్రీ బాధితురాలు మేజర్‌ అని చెబుతూ నివేదికను సమర్పించాడు. ఆపై బాలిక కిడ్నాప్‌-అత్యాచారం ఆరోపణలతో ముగ్గురు నిందితులను ఆ సమయంలో పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వారిపై పోక్సో చట్టాన్ని మాత్రం వర్తింప చేయలేదు. తర్వాత బాలికను మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టగా.. ప్రాణభయంతో ఆమె తన వాంగ్మూలంలో సెంగర్‌ పేరును ప్రస్తావించలేదు. తర్వాత ఏప్రిల్‌ 12, 2018లో ఆమె రెండో ఎఫ్‌ఐఆర్‌లో సెంగర్‌ పేరును ఆమె ప్రస్తావించగా.. పోలీసులు పోక్సో చట్టం ప్రకారం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. 

ప్రాథమిక వైద్య పరీక్షలో నివేదికలో మాత్రం ఆమె వయసు 19 ఏళ్లుగా ఉండటం సీబీఐ గమనించింది. దీంతో ఈ గందరగోళం నుంచి బయటపడేందుకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. శనివారం బాధితురాలిని లక్నో ప్రభుత్వాసుపత్రికి తరలించి పరీక్షలను నిర్వహించగా.. ఆ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆమె మైనర్‌ కాదని తేలితే.. సెక్షన్లను మార్చి దర్యాప్తు కొనసాగిస్తామని వారంటున్నారు. అయితే యువతి తల్లి మాత్రం బాలిక 2002లో జన్మించిందని వాదిస్తుండగా.. స్కూల్‌ సర్టిఫికెట్లలో కూడా ఆమె పుట్టిన తేదీ 2002గానే ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top