అమృత తండ్రి షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది? | Sakshi
Sakshi News home page

మారుతీ రావు షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?

Published Sun, Mar 1 2020 9:50 AM

Unknown Dead Body Found In Amrutha Father Maruthi Rao Shed In Suryapet - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో నిందితుడు మరుతీరావుకు చెందిన ఖాళీ షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  టూ టౌన్‌ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డు ఫ్‌లైవర్‌ సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న మారుతీరావుకు చెందిన ఖాళీ షెడ్డు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన స్థానికులు శనివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వారం రోజుల క్రితం మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుంది. కాగా మృతుడు నీలిరంగు చొక్కా, జీన్స్‌ పాయింట్‌ ధరించి ఉండగా చేతికి వాచ్‌ ఉంది. 

శవం గుర్తు పట్టకుండా ఉంది. శరీరం పూర్తిగా కుళ్లిపోయింది. మృతదేహంపై ఆయిల్‌ పోసినట్లుగా ఉండటంతో హత్య చేసిన అనంతరం ఆనవాళ్లు మాయం చేసేందుకు ప్రయత్నాలు చేశారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నల్లగొండ నుంచి క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

పట్టణంలో చర్చనీయాంశం..
పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో నిందితుడుగా ఉన్న మారుతీరావుకు చెందిన ఖాళీ స్థలంలోని షెడ్డులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం పట్టణంలో సంచలనం సృష్టించింది. దీంతో పట్టణ ప్రజలు భారీ ఎత్తున సంఘటనా స్థలానికి మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు.  మారుతీరావుకు చెందిన ఈ స్థలంలో గతంలో ఒక హోటల్‌ కోసం షెడ్లు వేయగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించే సమయంలో వచ్చే దుమ్ముతో ఆ హోటల్‌ మూసి వేశారు. అప్పటి నుంచి ఆ షెడ్డు ఖాళీగా ఉండగా అందులో  మృతదేహం లభ్యంకావడం చర్చనీయాంశమైంది. 

ఒక మృతదేహం..ప్రశ్నలు అనేకం.. 
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కడైనా హత్యచేసి ఇక్కడి షెడ్డులోకి తెచ్చి పడేశారా? లేక షెడ్డులోనే పథకం ప్రకారం హత్య చేసి గుర్తు పట్టకుండా ఆయిల్‌ పోశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి : అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..

‘చనిపోయే వరకు అమృత ప్రణయ్‌లానే ఉంటాను’

అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్‌

పరువు హత్యకేసులోబెయిల్‌..

Advertisement
Advertisement