రాకాసి అల ఇద్దరిని మింగేసింది..

Two Woman Died In Wave Attack In Beach East Godavari - Sakshi

బీచ్‌లో ఇద్దరు మహిళల మృతి

ప్రాణాలతో బయటపడిన మరో మహిళ

బంధువుల ఆర్తనాదాలతో మార్మోగిన కాకినాడ బీచ్‌

కాకినాడ రూరల్‌: పిల్లలకు వేసవి సెలవులు అయిపోతున్నాయి.. వారిని సంతోష పెట్టడానికి బీచ్‌కు తీసుకువచ్చిన ఆ ఇద్దరు తల్లులను రాకాసి అల మింగేసింది. దీంతో సంతోషంగా గడుపుదామని వచ్చిన వారి బంధువుల ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. కుటుంబ సభ్యులతో బీచ్‌కు వచ్చిన ముగ్గురు మహిళలు సముద్రంలో స్నానానికి దిగడంతో వారిని కెరటం ఒక్కసారిగా లాక్కొని వెళ్లిపోయింది. సముద్రంలో మునిగిన వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సామర్లకోట మండలం జి.మేడపాడు మెట్టకు చెందిన మేడిశెట్టి కృష్ణవేణి (27), జంపా సంగీత (23) సముద్రంలో మునిగిపోగా దుర్గాదేవి గాయాలతో బయటపడింది. మేడపాడు నుంచి కాకినాడ బీచ్‌కు ఒక ఆటోలో ఐదు కుటుంబాలకు చెందిన 14 మంది సభ్యులు సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌ వచ్చారు. సాయంత్రం 3 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతూ స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు.

ముగ్గురు మహిళలను కెరటం సముద్రంలోకి లాక్కుంది. మునిగిన దుర్గాదేవి పైకితేలడంతో కుటుంబ సభ్యులు ఆమెను రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరు సముద్రం లోపలికి వెళ్లిపోయారు. కుటుంబ çసభ్యులు చూస్తుండగానే వీరిద్దరూ సముద్రంలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో సాగరతీరం దద్దరిల్లింది. అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే వలలతో గాలించారు. వలలో చిక్కుకున్న కృష్ణవేణి, సంగీతలను బయటకు తీసి మొత్తం ముగ్గురిని ఆటోలో తీసుకొని సర్పవరం జంక్షన్‌లోని ఓ ప్రైవేట్టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరు మహిళలు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దుర్గాదేవికి మెరుగైన వైద్యం చేయడంతో ఆమె తేరుకుంది. వేసవి సెలవులు అయిపోతున్నందున పిల్లలతో ఒక్క రోజు ఆనందంగా గడపడానికి బీచ్‌కు వచ్చామని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై సర్పవరం సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ, తిమ్మాపురం ఎస్సై బి.తిరుపతిరావు ఆస్పత్రిని సందర్శించారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

బోరుమన్న జి. మేడపాడు మెట్ట
సామర్లకోట (పెద్దాపురం): జి. మేడపాడు మెట్టపై సాయిబాబా గుడి వీధికి చెందిన ఇద్దరు మహిళలు కాకినాడ బీచ్‌లో మునిగి పొయి మృతి చెందారన్న విషయం తెలియగానే ఆ ప్రాంతంలో మహిళలు బోరున విలపించారు. బీచ్‌ అభివృద్ది చేశారన్న ప్రచారం నమ్మి తరచూ మహిళలు ఆటోలపై బీచ్‌కు వెళుతున్నారని వారు విలపిస్తూ చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆటోలో ఆరుగురు మహిళలు పిల్లలతో కాకినాడ బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో ముగ్గురు మహిళలు చేతులు పట్టుకుని సముద్రంలోకి దిగితే కృష్ణవేణి, సంగీత పెద్ద కెరటం రావడంతో మునిగిపోయారని వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన సంగీతకు జి. మేడపాడుకు చెందిన జంపా గాంధీతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు, మూడేళ్ల బాలలు, నాలుగేళ్ల బాలిక ఉన్నారు.

గాంధీ తాపీ పని చేస్తుంటాడు. ఆదివారం సంగీత తల్లి వచ్చి ఉండిలో గృహ ప్రవేశం ఉందని సంగీత పెద్ద కుమారుడిని తీసుకువెళ్లింది. దీంతో మిగిలిన పిల్లలతో సంగీత బీచ్‌కు వెళ్లింది. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన కృష్ణవేణికి మేడపాడు గ్రామానికి చెందిన మేడిశెట్టి పురుషోత్తంతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. పురుషోత్తం లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. అందరూ ఏడుస్తుండడంతో వారి తల్లులు చనిపోయారన్న విషయం తెలియని ఆ పిల్లలందరూ బిక్కుబిక్కున చూస్తుండిపోయారు. వారిని స్థానికులు హత్తుకొని రోదించడం అందరినీ కలిచివేసింది. చిన్న పిల్లలను ఒంటరిని చేసి తల్లులు మృతి చెందడంతో బంధువుల రోదనతో సాయిబాబా గుడి వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top