మరణ శిక్ష కోసం మళ్లీ హత్యలు

Two Prisoners Killed Four for Death Penalty in South Carolina - Sakshi

కొలంబియా: తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లయింది వారి పరిస్థితి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల డెన్వర్‌ సైమన్స్, 28 ఏళ్ల జాకోబ్‌ ఫిలిప్ప్‌లకు రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో రెండేసి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 2010, ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు జంట హత్యల కేసులకు సంబంధించి 2015లో ఈ ఇద్దరు నేరస్థులకు రెండేసి జీవితఖైదులు పడ్డాయి. జైలు జీవితంలో భాగంగా వారిని కొలంబియాలోని ‘కిర్కిలాండ్‌ కరెక్షనల్‌ ఇనిస్టిట్యూట్‌’కు పంపించారు. కనీసం పెరోల్‌ కూడా లభించని జైలు జీవితం పట్ల వారికి విరక్తి పుట్టింది. అందుకు ఆ ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరణ శిక్షలు పొందాలనుకున్నారు.

పథకం ప్రకారం వారు 2017లో విలియం స్క్రగ్స్‌ (44), జిమ్మీ హామ్‌ (56), జాసన్‌ కెల్లీ (35), జాన్‌ కింగ్‌ (52) అనే నలుగురు తోటి ఖైదీలను హత్య చేశారు. ఆ కేసును విచారించిన రిచ్‌మండ్‌ కౌంటీ కోర్టు వారికి దిమ్మ తిరిగి పోయే తీర్పు చెప్పింది. వారికి చెరి మరో నాలుగు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వారికి మరణ శిక్షలు విధించరాదని, జైలు శిక్షలే విధించండని బాధితుల కుటుంబీకులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఆ మేరకే శిక్షలు విధించింది. మరణ శిక్షల కోసమే హత్యలు చేసినట్లు డెన్వర్‌ సైమన్స్, జాకోబ్‌ ఫిలిప్ప్‌లు చెప్పిన కారణంగా బాధితుల బంధువులు వారికి మరణ శిక్ష వద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top