చెంగిచర్ల ఘటనలో ఇద్దరు అరెస్ట్‌

సాక్షి, మేడ్చల్‌: చెంగిచర్ల వద్ద ఆయిల్‌ ట్యాంకర్ల పేలుడు, అగ్నిప్రమాదం సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్ల యజమానులు రాజు, జగదీష్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 3 బైక్‌లు, 2 కార్లు, 12 పెట్రోల్‌ ట్యాంకర్లు, రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దక్షిణ భారతంలోనే మొదటిదని రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఆయిల్‌ ట్యాంకర్ల నుంచి పెట్రోల్‌ తీస్తుండగా ప్రమాదం సంభవించిందని, ఇలా తీసిన పెట్రోల్‌లో కిరోసిన్‌ కలిపి విక్రయిస్తుంటారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో వీరు అక్రమంగా కార్ఖానా నిర్వహిస్తున్నారన్నారు. చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల నుంచి వెల్డింగ్‌ ద్వారా పెట్రోల్‌ తొలగించే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని జోషి తెలిపారు.

Back to Top