రైలులో సీటు కోసం డిష్యుం డిష్యుం

Train Passengers Conflict For Seat Adjustment - Sakshi

కమలాపురం స్టేషన్‌లో దించేసినరైల్వే పోలీసులు

పోలీసు స్టేషన్‌కు చేరిన ఇరు వర్గాల వారు

కమలాపురం: ఆస్తి పాస్తుల కోసమో.. డబ్బు కోసమో ఘర్షణ పడి పోలీస్‌ స్టేషన్‌ వరకు వచ్చే వారిని చూస్తుంటాం. కానీ రైలులో ప్రయాణిస్తూ సీటు కోసం ఘర్షణ పడి పోలీస్‌ స్టేషన్‌కు చేరిన సంఘటన కమలాపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా, సీఎస్‌ పురం మండలం, చెర్లోపల్లెకు చెందిన రామనబోయిన సుబ్బయ్య, రామయ్య, సుధూర్, ఇండ్ల వెంకటేష్‌ తదితరులు వారి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుణేలో జరుగుతున్న వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు సాయంత్రం రేణిగుంటలో దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అలాగే వేంపల్లెకు చెందిన నామా శ్రీనివాసులు, హేమంత్, కశెట్టి నరసింహులు తమ కుటుంబ సభ్యులతో తిరుపతిలో మలుపెళ్లి చూసుకొని   రేణిగుంటలో రైలు ఎక్కారు.

కడప వరకు వారి ప్రయాణం సజావుగా సాగింది. కడప రైల్వే స్టేషన్‌ దాటాక ఆ రెండు కుటుంబాల వారు సీటు కోసం ఘర్షణకు దిగారు. మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. అయితే ప్రకాశం జిల్లా వాసులు ఎక్కువ మంది ఉండటంతో వేంపల్లె వారిని గాయ పడే విధంగా కొట్టారు. ఈ విషయాన్ని గమనించిన రైల్వే పోలీసులు వారిని కమలాపురం పోలీస్‌ స్టేషన్‌లో దించి వేశారు. దీంతో వారు కమలాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కమలాపురం పోలీసులు రైలులో జరిగిన ఘర్షణతో తమకు సంబంధం ఉండదని, కడప రైల్వే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సూచించడంతో వారు కడప రైల్వే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top