12 పాఠశాలలను తగలబెట్టిన ఉగ్రవాదులు

Terrorists Burns Down Twelve schools In POK - Sakshi

ఒక ఆడపిల్ల (మలాలా) చదువుకుంటేనే.. ఆకాశమంత ఎత్తు ఎదిగి, నోబెల్‌ అవార్డు అందుకునే స్థాయికి చేరుకుంది. మూఢాచారాలపై, మతఛాందసవాదులపై ఏకంగా యుద్ధమే చేస్తోంది. మరి దేశంలోని మిగతా ఆడపిల్లలంతా చదువుకుంటే... అమ్మో, ఇంకేమైనా ఉందా? ఉగ్రవాదాన్ని, మూఢాచారాల్ని కూకటివేళ్లతో పెకలించేయరూ..! అందుకేనేమో.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తీవ్రవాదులు తగలబెట్టేస్తున్నారు.  

విద్య మనిషిని సంస్కరిస్తుంది... జ్ఞానాన్ని పెంచుతుంది... అజ్ఞానాన్ని తుంచేస్తుంది. ఆధునికతవైపు నడిపిస్తుంది... మూఢాచారాలపై పోరాడే శక్తినిస్తుంది. అందుకేనేమో.. మతఛాందసవాదులైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఆ విద్యకు ఆలవాలమైన పాఠశాలలపై కన్నేశారు. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో చాటిచెప్పి.. నోబెల్‌ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగిన మలాలా పుట్టిన గడ్డపైనే.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తగులబెడుతున్నారు. వివరాల్లోకెళ్తే..  

పూర్తిగా ధ్వంసం: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు 12 స్కూళ్లను తగలబెట్టారు. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు.. స్కూళ్లకు తగిన రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గిల్గిత్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలాస్‌ టౌన్‌లో గురువారం రాత్రి మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. 12 స్కూళ్లను తగలబెట్టి, పూర్తిగా ధ్వంసం చేశారని స్థానిక డైమర్‌ జిల్లా ఎస్పీ రాయ్‌ అజ్మల్‌ వెల్లడించారు. దీనిపై విచారణ మొదలుపెట్టామని, నిందితులను పట్టుకోవడానికి భద్రత దళాలు వేట మొదలుపెట్టాయని చెప్పారు. స్కూళ్లపై ఎలాంటి బాంబు దాడీ జరగలేదని డైమర్‌ ప్రాంత కమిషనర్‌ అబ్దుల్‌ వహీద్‌ చెప్పారు.

నిర్మాణంలో ఉన్న పాఠశాలలపైనా..: మిలిటెంట్లు దాడి చేసిన స్కూళ్లలో కొన్ని ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయని, భవిష్యత్తులో పాఠశాలలేవీ నిర్మించకుండా ఉండేందుకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దాడులకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రాంతంలో గతంలోనూ తాలిబన్లు  స్కూళ్లపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలికల పాఠశాలలపైనే ఎక్కువగా ఈ దాడులు జరిగేవి. మళ్లీ ఆ రోజులను గుర్తుచేస్తూ ఘటనలు జరుగుతుండడంపై గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top