విధి వంచిత.. వలస కుటుంబం

Tenth class Student Died in Train Accident Visakhapatnam - Sakshi

రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థి దుర్మరణం

పండగకు వెళ్లి శవమై తేలాడు..

దానబోయినపాలెం సమీపంలో ఘటన

గతేడాది విద్యుత్‌ షాక్‌తో సోదరుడి మృతి

అగనంపూడి(గాజువాక): రైలు పట్టాలపై విద్యుత్‌ షాక్‌కు గురై చిన్న కొడుకును కోల్పోయిన బాధ నుంచి తేరుకోని తల్లిదండ్రులకు అదే రైలు పట్టాలు మళ్లీ యమపాశాలుగా మారాయి. పండగ కోసం వెళ్లిన పెద్ద కొడుకు ప్రాణాలు కూడా తీసేశాయి. సరదాగా గ్రామదేవత పండగకు స్నేహితులతో వెళ్లిన పదో తరగతి విద్యార్థి రైలు పట్టాలపై శవమై తేలాడు. పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంపై విధి కన్నెర్ర చేసిన ఉదంతం ఇది.

దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అగనంపూడి నిర్వాసిత కాలనీ దానబోయినపాలెం వద్ద రైలు పట్టాలపై జరిగిన ప్రమాదానికి సంబంధించి దువ్వాడ జీఆర్‌పీ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజగిరి పదేళ్ల క్రితం ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో విశాఖకు వలస వచ్చారు. ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అగనంపూడి నిర్వాసిత కాలనీ దిబ్బపాలెంలో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమారుడు ఆదిత్య గిరి(14) అగనంపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. గత నెలలో పరీక్షలు కూడా రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం డొంకాడలో గ్రామదేవత పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి వెళ్తున్నట్టు తల్లి రాణికి చెప్పి వెళ్లాడు. అయితే ఆదిత్య రాత్రి 11 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో బీ–షిఫ్ట్‌ ముగించుకొని ఇంటికి వచ్చిన మనోజ్‌ పండగ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కుమారుడి కోసం వెతికాడు.

కనిపించకపోవడంతో స్నేహితులు, తెలిసిన వారి ఇళ్లలో వాకబు చేసినా ఫలితం లేదు. పండగలో విధులు నిర్వహించే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటాడు.. ఉదయం చూద్దామనుకొని ఇంటికి వచ్చిన మనోజ్‌కు  శుక్రవారం ఉదయం గుండె పగిలే వార్త తెలిసింది. తన ఇంటికి దగ్గరలోని దానబోయినపాలెం సమీపంలోని రైలు పట్టాల పై ఆదిత్య శవమై కనిపించాడు. ఈ దుర్ఘటనలో తల, మొండెం రెండుగా విడిపోవడంతో పాటు శరీర భాగాలు నుజ్జయ్యాయి. ఆదిత్య తన సైకిల్‌ను పట్టాల పక్కన ఉంచి బహిర్భూమికి వెళ్లే సమయంలో రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. దువ్వాడ పోలీసులు, జీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. మృతుని తల్లిదండ్రులు, చెల్లి ప్రమాద విషయం తెలిసి తల్లడిల్లిపోయారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు.

అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న
గతేడాది ఇదే సమయంలో ఆదిత్య తమ్ముడు అలోక్‌ గిరి ఆడుకుంటూ వెళ్లి వడ్లపూడి రైలు పట్టాల వద్ద విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఇంకా ఆ బాధ నుంచి తేరుకోకముందే ఇప్పుడు ఆదిత్య మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీటిపర్వంతమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top