మెంచు రమేష్, శిల్ప అరెస్టు

Telangana Praja Front State Secretary Arrested By Gadwal Police - Sakshi

మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు

అదుపులోకి తీసుకున్న గద్వాల పోలీసులు

మల్లాపూర్‌: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ నాచారం దుర్గానగర్‌లో ఉండే తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్‌ను గద్వాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోదాలు నిర్వహించి కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా రేపోని గ్రామానికి చెందిన మెంచు ఎల్లయ్య, భారతమ్మల చిన్న కుమారుడు రమేష్‌(36) ఉస్మానియాలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం రాణితో వివాహం అయింది. వీరికి పాప ఉంది.

మంగళవారం నాచారం దుర్గానగర్‌లోని రమేష్‌ ఇంట్లో గద్వాల పోలీసులు 6 గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు 15 మంది వచ్చి ఇంట్లో తనిఖీలు, సోదాలు చేశారని రాణి తెలిపారు. పోలీసులే విప్లవ సాహిత్య పుస్తకాలను తీసుకొచ్చి కిచెన్‌ రూమ్‌లో పెట్టి ఇంట్లో దొరికినట్లు ఆరోపిస్తూ తన భర్తను అరెస్ట్‌ చేసినట్లు ఆమె వెల్లడించారు. 2 నెలల నుంచి రమేష్‌ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు.

శిల్ప ఇంట్లో సోదాలు... 
కీసర: మేడ్చల్‌ జిల్లా నాగారం మున్సిపాలిటీ ఎస్వీ నగర్‌లో ఉంటున్న చైతన్య మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిల్పను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నాగారానికి చేరుకున్న గద్వాల పోలీసులు కీసర పోలీసుల సహకారంతో శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించిన పోలీసులు శిల్ప ఇంట్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు, లెటర్‌ ప్యాడ్స్, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. శిల్పను కూడా అదుపులోకి తీసుకొని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా అరెస్టులపై పౌర హక్కుల సంఘం, ఇతర సంఘాలు నిరసన తెలిపాయి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top