ముఖంపై కత్తిపోట్లు.. ఆపై కట్టుకథ | Tamil Nadu Man stabs Girlfriend As Her Phone Busy | Sakshi
Sakshi News home page

Jun 16 2018 2:32 PM | Updated on Jun 16 2018 2:32 PM

Tamil Nadu Man stabs Girlfriend As Her Phone Busy - Sakshi

కాల్‌ చేస్తే ఫోన్‌ బిజీ... సహనం నశించిన బాయ్‌ ఫ్రెండ్‌ ప్రేయసిని నిలదీశాడు. అయితే ఆమె ఇచ్చిన సమాధానం అతనికి చికాకు తెప్పించింది. అంతే.. తన వెంట తెచ్చుకన్న కత్తితో ప్రేయసి ముఖంపై గాయం చేశాడు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో  భయపడి కట్టుకథ చెప్పాడు. కానీ, తెలివిగా విషయాన్ని రాబట్టిన పోలీసులు చివరకు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.

సాక్షి, చెన్నై: ఎర్నవూర్‌కు చెందిన కవియరసన్‌ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతితో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తరచూ పార్క్‌ల్లో, రైల్వే స్టేషన్‌లో ఇద్దరు కలియదిరిగేవారు. అయితే కొన్ని రోజులుగా కవియరసన్‌ ఫోన్‌ కాల్‌కు సదరు యువతి స్పందించటం లేదు. పైగా ఆమె ఫోన్‌ బిజీ వస్తుండటంతో అనుమానం పెంచుకున్నాడు. 

గురువారం సాయంత్రం ఎన్నోర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద కలుసుకున్న ఆ ఇద్దరు ఈ విషయంపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సదరు యువకుడు తన బ్యాగ్‌ నుంచి కత్తి తీసి ఆ యువతి ముఖాన్ని గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి రోదిస్తుంటే.. భయపడి ఆమెను బతిమాలటం మొదలుపెట్టాడు. ఆపై ఆస్ప్రతికి తీసుకెళ్తుండగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వ్యాన్‌ వారిని గమనించి విషయం ఆరా తీసింది. 

భయంతో ఆ యువకుడు కట్టుకథ అల్లాడు. ‘దొంగలు తమపై దాడి చేశారని, తన ఫోన్‌ కూడా లాక్కుపోయారని’ పోలీసులకు తెలిపాడు. ప్రియుడ్ని జైలుకు పంపటం ఇష్టం లేని ఆ యువతి కూడా అదే జరిగిందని తెలిపింది. సరిగ్గా అదే సయమంలో కవియరసన్‌ ఫోన్‌ రింగ్‌ కావటంతో పోలీసులకు అనుమానం మొదలైంది. ఇద్దరినీ విడివిడిగా కూర్చోబెట్టి ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ఆపై యువకుడిని అదుపులోకి తీసుకుని, యువతికి ఫస్ట్‌ ఎయిడ్‌ చేయించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement