అంతుచిక్కని మిస్టరీ..!

Still Mystery on Lockup Death in Visakhapatnam - Sakshi

సీసీఎస్‌లో లాకప్‌ డెత్‌పై భిన్నవాదనలు

రెండు రోజులైనా ఆచూకీ తెలియని పైడిరాజు మృతదేహం

మరోవైపు బతికే ఉన్నాడంటున్న నగర పోలీసులు

అల్లిపురం(విశాఖ దక్షిణ): సీసీఎస్‌లో లాకప్‌ డెత్‌ విషయంలో మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌ డెత్‌ జరిగిందని మంగళవారం కలకలం రేగిన విషయం తెలిసిందే. మృతిచెందాడని భావిస్తున్న గొర్లి పైడిరాజు(26) మృతదేహం ఆచూకీ బుధవారం కూడా తెలియక పోవడం విశేషం. ఆరోపణల నేపథ్యంలో నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా ఆదేశాల మేరకు విచారణ అధికారి, జేసీపీ దాడి నాగేంద్రకుమార్‌ మంగళవారం రాత్రి వి చారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం జేసీపీతో పాటు డీసీపీ ఫకీరప్ప, క్రైం డీసీపీ ఏఆర్‌ దామోదరరావు, ఏడీపీసీ వి.సురేష్‌బాబు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు.

మూడు బృందాలు ఏర్పాటు చేశాం
గొర్లి పైడిరాజు అనే యువకుడు భారత్‌ బంద్‌ రోజున అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎంవీపీ పోలీసులు అదుపుకులోకి తీసుకున్నారని జేసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. బంద్‌ కారణంగా స్టేషన్‌లో సిబ్బంది లేకపోవడంతో పండావీధిలో గల ఆయన భార్య ఎర్ని కుమారిని తీసుకొచ్చి బైండోవర్‌ చేసి పంపించేశామని వివరించారు. తరువాత ఏం జరిగిందో మాకు తెలియదని జేసీపీ తెలియజేశారు. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు ముగ్గురు సీఐల నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బృందాలు తిరిగి వచ్చిన తరువాత వివరాలు తెలియజేస్తామని జేసీపీ వివరిచారు. ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులు పైడిరాజు లాకప్‌ డెత్‌ అయ్యాడని ఆరోపిస్తున్నారని, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ జయకుమార్, సీఐ దుర్గాప్రసాద్‌లే విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, తరువాత మృతదేహాన్ని అక్కడి నుంచి పోలీస్‌ జీపులో విజయనగరం తరలించి, అక్కడ దహనం చేశారని ఆరోపిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా... అందులో నిజం లేదని జేసీపీ ఖండించారు. వారు ఆరోపిస్తున్న రిటైర్ట్‌ కానిస్టేబుల్‌ జయకుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. విచారణలోనే నిజం తెలియాల్సి ఉందని, ఇంతకు మించి తమ వద్ద సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.

పైడిరాజు బతికుంటేకోర్టుకు తీసుకురండి
గొర్లి పైడిరాజును పోలీసులే లాకప్‌ డెత్‌ చేశారని విశాఖ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.హెచ్‌.అక్బర్‌ ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఆయన సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి జేసీపీ దాడి నాగేంద్రకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేసీపీతో మాట్లాడుతూ గొర్లి పైడిరాజు అనే వ్యక్తిని సీసీఎస్‌కు తీసుకురావడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. పైడిరాజును పోలీసులే లాకప్‌ డెత్‌ చేశారని ఆరోపించారు. బతికే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారని, అలాంటప్పుడు తక్షణమే పైడిరాజును కోర్టులో హాజరుపరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని, లాకప్‌డెత్‌కు కారకులైన వారికి షోకాజ్‌ నోటీసులిచ్చి, జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ను, సీఐని సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top