సొసైటీ అధ్యక్షుడి అరెస్టు

Socity President Arrest in Molestation Case Orissa - Sakshi

మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణ

నిందితుడు బీజేడీ నేతగా ప్రచారం

భువనేశ్వర్‌: లైంగిక వేధింపులకు పాల్పడిన నేరం కింద కేంద్రాపడా జిల్లా క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు, బిజా జనతా దళ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్‌ సాహును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ ముగించిన పోలీసులు ఆయనను   స్థానిక సబ్‌–డివిజినల్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది.  నిందితుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. న్యాయ స్థానం ఉత్తర్వుల మేరకు నిందితుడిని బరిమూల్‌ కారాగారానికి తరలించారు. అంతకుముందు ఆదివారం అర్ధరాత్రి కేంద్రాపడా జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంటు బి. గగరిన్‌ మహంతి నేతృత్వంలో ప్రత్యేక టీమ్‌ ఆకస్మిక దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుంది.

నిందిత ప్రమోద్‌ సాహుకు వ్యతిరేకంగా కేంద్రాపడా జిల్లా క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమెప్రధాన ఆరోపణ. ఆరోపణను బలపరిచే రీతిలో ఆమెతో నిందితుడి ఫోను సంభాషణ రికార్డులు ఇతరేతర బలమైన ఆధారాల్ని స్థానిక పోలీసులు, మీడియా వర్గాలకు బాధితురాలు బహిరంగపరిచింది. నిందితుడు వివాహేతర సంబంధం కోసం ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు వాపోయింది. ఈ పరిస్థితుల్లో నిందితుడికి  వ్యతిరేకంగా చర్యలు చేపట్టకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధిత మహిళ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు అనంతరం హెచ్చరించింది.

నిందితుడితో సంబంధం లేదు: బీజేడీ
కార్యాలయం సిబ్బంది పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్రాపడా జిల్లా క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు ప్రమోద్‌ సాహు అధికార పక్షం బిజూ జనతా దళ్‌ ప్రముఖ సభ్యుడిగా ప్రచారమైంది. ఈ ప్రచారం పట్ల బిజూ జనతా దళ్‌ కార్యాలయం సోమవారం స్పందించింది. నిందిత ప్రమోద్‌ సాహుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. చాలా రోజుల కిందటే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు బిజూ జనతా దళ్‌ అధికార ప్రతినిధి లెనిన్‌ మహంతి ఓ ప్రకటన జారీ చేయడం విశేషం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top