రైల్వేపోలీసుల ఎత్తుకు స్మగ్లర్ల పైఎత్తు..!

Smugglers Finding New Ways To Transport PDS Rice In Rails - Sakshi

సవాల్‌గా మారిన బియ్యం రవాణా నియంత్రణ

మొన్నటివరకు టాయిలెట్స్‌లో దాచి తరలింపు..

ఇప్పుడు సీట్లకింద పారబోసి.. 

సాక్షి, మంచిర్యాల: రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కొంత పుంతలు తొక్కుతోంది. బియ్యం అక్రమ రవాణా చేయడంలో అక్రమదారులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. నాడు బియ్యం తరలించే సమయంలో రైల్వే పోలీసులకు దొరకుండా టాయిలెట్లలో నింపి లోపల ఓ వ్యక్తి గడియ పెట్టుకుని ఉండేవారు. తనిఖీ చేసేందుకు వచ్చిన పోలీసులు బయట దొరికిన బియ్యం సంచులను మాత్రమే తీసుకువెళ్లేవారు.     టాయిలెట్‌లో దాచిపెట్టిన బియ్యాన్ని దింపే సమయంలో డోర్‌ వెళ్లకపోతే ధ్వంసం చేసేవారు. ‘అక్రమ రవాణా ఆపై ధ్వంసం’ అనే కథనం ‘సాక్షి ’దిన ప్రతికలో ఆగస్టు 13న ప్రచురణ కాగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేసే వారు తమ పంథాను మార్చుకున్నారు. ప్రస్తుతం కొత్త పద్ధతిలో తరలిస్తూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. 

రైలుమార్గం వరం
అక్రమంగా రేషన్‌ బియ్యం తరలించేందుకు అక్రమార్కులకు రైలుమార్గం వరంగా మారింది. రైల్వేపోలీసులు, టీసీ ఎవరైన అడ్డు పడితే చాలు నయానో.. బయానో ముట్టజెప్పి తమపని యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. అధికంగా కాజిపేట నుంచి మహారాష్ట్రకు వెళ్లే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్, అజ్ని ప్యాసింజర్‌ రైళ్లల్లో అధికంగా జరుగుతోంది. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 6గంటలకు కాజిపేట నుంచి బయలు దేరుతోంది. అజ్ని ప్యాసింజర్‌ రాత్రి 10:30 గంటలకు బయలుతేరుతోంది. ఈ రెండు రైళ్లు తెల్లవారే లోపు మహారాష్ట్రలోని వీరూర్‌కు చేరుకుంటాయి. రాత్రి వెళ్లడంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణ దారులకు ఈ రెండు రైళ్లు అనుకూలంగా మారింది.

ఆగని బియ్యం దందా...
మహారాష్ట్రలోని వీరూర్‌కు మన రేషన్‌ బియ్యం భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్, ఆజ్ని ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా యథేచ్ఛగా అక్రమార్కులు రేషన్‌ బియ్యం తరలిస్తున్నారు. కాజిపేట నుంచి ప్రతిరోజు సాయంత్రం 6గంటలకు బయలు దేరిన భాగ్యనగర్‌ అర్ధ రాత్రి 2గంటల ప్రాంతంలో వీరూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఆజ్ని ప్యాసింజర్‌ రాత్రి 10:30గంటలకు కాజిపేట నుంచి బయలుదేరి తెల్లవారు జామును వీరూర్‌కు చేరుకుంటుంది. ప్రతి రోజు గంటల తరబడి ఆలస్యంగా నడువడంతో బియ్యం స్మగ్లర్లకు ఇది వరంగా మారింది. వీటి వెనుకల వచ్చే మరో సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు ఉప్పల్, పోత్కపల్లి, ఓదెల తదితర కొన్ని స్టేషన్లలో క్రాసింగ్‌ పెట్టి నిలిపి వేయడంతో బియ్యం రైల్లో ఎక్కించుకునేందుకు సమయం కలిసి వస్తోంది. సంచుల్లోని బియ్యాన్ని సీట్ల కింద పారబోసి తమకు ఏమి ఏరుగనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు భాగ్యనగర్‌. ఆజ్నీ ప్యాసింజర్‌ రైళ్లో హసన్‌పర్తిరోడ్డు, ఉప్పల్, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, రాఘవపూరం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, రేచినిరోడ్‌ ఈ రైల్వేస్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 70నుంచి 80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు.

గతంలో రవాణా ఇలా...
గతంలో రేషన్‌ బియ్యం తరలిస్తుండగా రైల్వేపోలీసులకు పట్టుబడితే బియ్యం పట్టుకోవడం లేదా బ్యాగులు చింపేసి పడేయం లాంటివి జరిగేవి. ఆ తరువాత బియ్యం సంచులను టాయిలెట్‌ రూములో  భద్రపరిచి ఓ వ్యక్తి లోపలనే ఉండి డోర్‌లాక్‌ చేసుకుని తరలించేవారు.

రైల్వేస్టేషన్‌ గోడపైన తరలించేందుకు సిద్ధంగా బియ్యం సంచులు; సీట్లకింద పోసిన రేషన్‌ బియ్యం 

సీట్ల కింద బియ్యం...
రైలు బోగిల్లోకి ఎక్కించిన బియ్యం సంచుల్లో నుంచి  సీట్లకింద పారబోసి అవి ఎవరివో మాకేం తెలియదన్నట్లుగా సీట్లపై పడుకుంటున్నారు.  విడిగా ఉన్న బియ్యాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలియక అధికారులు వదిలేస్తున్నారు. రేషన్‌ బియ్యం స్టేషన్‌ ప్లాట్‌ఫారంపైకి రాకముందే కట్టడి చేస్తే రైలుమార్గం వెంట బియ్యం అక్రమ రవాణా అరికట్టవచ్చు.

రైల్వే అధికారుల అండతో..
రేషన్‌ బియ్యం అక్రమ రవాణా రైల్వే అధికారుల అండతోనే యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రైళ్లలో గస్తీ తిరుగుతున్న రైల్వేపోలీసులు రేషన్‌ బియ్యం స్మగ్లర్లను గుర్తించకపోవడంపై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. రైల్వే అధికార యంత్రంగం ఈ వ్యవహారాన్ని మాములు ‘గా’ తీసుకుంటున్నారనే ఆరోపనలున్నాయి.

41 క్వింటాళ్లు పట్టివేత 
తాండూర్‌(బెల్లంపల్లి): మండలంలోని రేచిని రోడ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. రేచిని రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రైళ్లల్లో మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఇళ్లల్లో దాడులు నిర్వహించారు. తలుపులు లేని ఓ ఇంట్లో 90బస్తాల్లో 41 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. బియ్యాన్ని మండల కేంద్రంలోని గోదాంకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ గోవింద్‌ , సిబ్బంది పాల్గొన్నారు.

56 క్వింటాళ్లు
కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్నట్లు రైల్వే రక్షక దళం ఎస్సై ఏటీఎస్‌ నర్సింహులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రంలోని విరూర్‌కు పలు ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఉదయం నుంచి పలు రైళ్లలోని బోగిల్లో తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో 185 బ్యాగుల బియ్యం బస్తాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఆర్పీఎఫ్‌ సీఐ రాకేష్‌ మీణా ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. 185 బ్యాగుల్లో మొత్తం 56 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top