కారా'భా'రం

Skin infections and infestations in prison inmates - Sakshi

జిల్లాలో కిక్కిరిస్తున్న జైళ్లు

పరిమితికి మించిపోతున్న ఖైదీలు

తమిళ ఎర్ర కూలీలతో మరింత ఎక్కువ

కొలిక్కిరాని కొత్త కారాగారాలు

అంటురోగాలు.. అనారోగ్యంతో దిగాలు

ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నఅధికారులు

జిల్లాలోని జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో కోడిపిల్లల్ని బుట్టలో వేసి కుక్కినట్లు కుక్కేస్తున్నారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా మగ్గుతున్న వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. విడుదలయ్యేటప్పటికి పలువురు ఖైదీలు మంచంపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. జైళ్లలోని దుస్థితిపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చీవాట్లు పెడుతున్నా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పురాకపోవడం గమనార్హం.  

తప్పట్లేదు..
తిరుపతి, సత్యవేడు లాంటి ప్రాంతాల్లో కొత్తగా జైళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. నిధుల కోసం నిరీక్షిస్తున్నాం. ఎర్రచందనం కేసుల్లో వస్తున్న వారిపై హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్లు పెడుతుండడంతో వీరికి బెయిల్‌ రావడానికి 60 నుంచి 90 రోజులు పడుతోంది. ఒక్కోసారి బెయిల్‌ వచ్చినా ష్యూరిటీ ఇచ్చేవారులేక ఇక్కడే ఉండిపోతున్నారు. వారికి వైద్యులతో పరీక్షలు చేయించి, మందులు కూడా ఇస్తున్నాం. మరీ సీరియస్‌గా ఉంటే ప్రభుత్వాస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నాం. పరిమితి మించినా ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో ఖైదీలను ఉంచాల్సి వస్తోంది. – బ్రహ్మయ్య, జిల్లా జైళ్ల అధికారి

చిత్తూరు అర్బన్‌: నేరాలు, ఆరోపణల్లో పోలీసులు అరెస్టు చేస్తున్న నిందితులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. పరిమితికి మించి జైళ్లలో కుక్కేస్తుండడంతో వారు అనారోగ్యం బారినపడుతున్నారు. మహిళా ఖైదీల హక్కులు కాలరాస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా జైలు ఉండగా తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె ప్రాంతాల్లో సబ్‌జైళ్లు ఉన్నాయి. నెలకు సగటున 180 మంది ఖైదీలు జైళ్లకు వస్తుండగా అందులో 12 మంది మాత్రమే బెయిల్‌పై విడుదలవుతున్నారు. మిగిలివారు ఆరోపణలు ఎదుర్కొంటూ అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా కారాగారాల్లోనే ఉండిపోతున్నారు.

ఎర్ర స్మగ్లర్లతో మరింత ఎక్కువ..
జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఎక్కువ. తమిళనాడు నుంచి చెట్లను నరకడానికి వస్తున్న వారిని వందల సంఖ్యలో పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో జైళ్లలో ఉండాల్సిన ఖైదీల పరిమితికంటే మూడు రెట్లు ఎక్కువ మందిని వేయక తప్పడం లేదు.

వైద్యసేవలు అంతంతమాత్రమే..
ఖైదీలకు క్షయ, శ్వాసకోస, చర్మవ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వ్యాధులబారిన పడుతున్న వారికి ఇక్కడ అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే. జైలు నుంచి విడుదలయ్యే నాటికి ఖైదీలు పూర్తిగా మంచానపడి కాటికి కాళ్లు చాపుతున్నారు. కొందరు ఆరోగ్యం బాగుచేసుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లెలోని జైళ్లలో మహిళా ఖైదీలు ఉంటున్నా. వీరి హక్కులకు భంగం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలా చేస్తే..
అండర్‌ ట్రయల్‌ కేసుల్లో దీర్ఘకాలికంగా జైళ్లలో మగ్గిపోతున్న వారికి ఉచిత న్యాయసేవల ద్వారా బెయిల్‌ ఇప్పించే పద్ధతులపై అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పారిపోడు, దర్యాప్తుకు సహకరిస్తాడనే కేసుల్లో పోలీసులు అరెస్టులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉందనే వాదనలున్నాయి. మహిళా ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా జైళ్లలోని బ్యారక్‌లలో సీసీ కెమెరాలు ఉంచడం లాంటివి చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి జైలులో వారానికి ఒక్కసారైనా మానసిక వైద్య నిపుణుల ద్వారా ఖైదీల మనోగతాన్ని తెలుసుకుని చికిత్స చేయడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top