ఆ కేసుల మాటేమిటి?

Sensation of Fake fingerprint manufacturing in peddapdalli - Sakshi

ఏటా వేలిముద్రల ఆధారంగా అనేక కేసులు కొలిక్కి

ఈ ఆధారాలతోనే అభియోగపత్రాలు సైతం దాఖలు

‘నకిలీ వేలిముద్రల’ఉదంతంలో ఉలిక్కిపడిన పోలీస్‌

చర్చకు దారితీసిన ‘సాక్షి’కథనం

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా ఏటా చోటు చేసుకుంటున్న నేరాల్లో వేలిముద్రల ద్వారా కొలిక్కి వస్తున్న వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ కేసుల్లో నిందితులపై అభియోగాలు మోపడం, నేరం నిరూపించడంలోనూ ఈ వేలిముద్రలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ‘ఆధార్‌’గోప్యతపై దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యవస్థల్లో ఉన్న లోపాలపై మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన ‘వేలికి ‘నకిలీ’ముద్ర!’కథనం తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన పాత సంతోష్‌ కుమార్‌ సిమ్‌కార్డుల యాక్టివేషన్‌ కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేయడం సంచలనంగా మారింది.

ఈ వ్యవహారంపై మంగళవారం పోలీసులతో పాటు మరికొన్ని విభాగాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. నష్టనివారణ చర్యలతో పాటు విచారణ దశలో ఉన్న కేసుల అంశాన్నీ చర్చించాయి. వివిధ కేసుల పరిశోధన, నేర నిరూపణలో వేలిముద్రల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే సంతోష్‌ సృష్టించిన నకిలీ ‘వేలి ముద్రలు’దీన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ప్రభావం కేసుల దర్యాప్తు, విచారణ తీరుపై ఉండే అవకాశం లేకపోలేదని, అనేక కేసులు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వీడిపోయే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో నేర స్థలిలో సేకరించిన వేలిముద్రలు నిందితులవే అని పక్కాగా నిర్ధారించడానికి అవసరమైన పరిజ్ఞానం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ వ్యక్తి పూర్తి పేరు, ఆధార్‌ నంబర్, వేలిముద్ర... ఇవి అసాంఘిక శక్తుల చేతికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పడానికి సంతోష్‌దే పెద్ద కేస్‌ స్టడీగా పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క నకిలీ వేలిముద్రలు తయారు చేయడానికి సంతోష్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన వివరాలనే వినియోగించడంతో ఆ శాఖకు ఓ లేఖ రాయాలని పోలీసులు భావిస్తున్నారు.

డాక్యుమెంట్స్‌ ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్‌ చేసే సమయంలో ఆధార్‌ వివరాలు, వేలిముద్రల కాలమ్స్‌ కనిపించకుండా చేసేలా సిఫార్సు చేయనున్నారు. మరోపక్క సంతోష్‌ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీలో ప్రతి 3 నెలలకు ఓసారి జరిగే మల్టీ ఏజెన్సీస్‌ కమిటీ (మ్యాక్‌) సమావేశం మరో వారంలో జరుగనున్నట్లు తెలిసింది. ఇందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. ఇందులో ఈ కేసును ఓ స్టడీగా చూపించి దేశ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి లోపాలు గుర్తించడంతో పాటు వాటిని సరిచేయడానికి మార్గాలు అన్వే షించాల్సిందిగా అన్ని విభాగాలను కేంద్రం కోరనున్నట్లు సమాచారం.

సంతోష్‌.. ఇంతపెద్ద నేరం చేశాడా?
ధర్మారం (పెద్దపల్లి): నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్‌.. ఇంతపెద్ద నేరం చేశాడా అని ధర్మారం వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిమ్‌కార్డుల టార్గెట్‌ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల నివ్వెరపోతున్నారు. కాగా.. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో సంతోష్‌ వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top