సినీ ఫక్కీలో 30 మంది ఎర్రకూలీలు, స్మగ్లర్ల అరెస్ట్‌

Sandlewood Smugglers Arrest in Chittoor - Sakshi

ఈచర్‌ వాహనంలో ఎర్రకూలీలు, స్మగర్ల తరలింపు

పసిగట్టిన ఫారెస్ట్‌ అధికారులు

కలకడ నుంచి పీలేరు వరకూ వాహనాన్ని వెంబడించిన సాయుధ ఫారెస్ట్‌ సిబ్బంది

వాహనం సహా వంట సామగ్రి స్వాధీనం

విచారణ చేస్తున్న పీలేరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు

చిత్తూరు, పీలేరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వెళుతున్న 30 మంది తమిళ కూలీలను సినీ ఫక్కీలో అరెస్ట్‌ చేసిన సంఘటన గురువారం సాయంత్రం పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో కలకలం సృష్టించింది. వివరాలు..ముందుగా అందిన సమాచారం మేరకు పీలేరు ఫారెస్ట్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, సిబ్బంది కలకడ నుంచి ఈచర్‌ వాహనాన్ని వెంబడించారు. స్మగ్లర్లు, కూలీలను మారణాయుధాలతో తరలిస్తున్నారనే సమాచారం అందడంతో ఆద్యంతం అనుమానం రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.

చాకచక్యంగా పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో తుపాకులు ఎక్కుపెట్టి ఏపీ16 టీఎక్స్‌ 3615 నంబరు గల ఈచర్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఎటువంటి అనుమానం రాకుండా చుట్టూ టమోటా బుట్టలు పెట్టి లోన 30 మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లు ఉండటం గుర్తించారు. అలాగే అడవిలో వంట చేసేందుకు అవసరమైన వస్తు సామగ్రి, సరకులు అందులో ఉన్నాయి. తుపాకులతో చుట్టుముట్టడంతో వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. వారిని అటవీ కార్యాలయానికి తరలించారు. వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో విచారణలో తెలియాల్సి ఉంది.

అటవీ అధికారుల గోప్యత
విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామంటూ అటవీ అధికారులు మీడియాకు చెప్పారు. డీఎఫ్‌ఓ నరసింహారావు ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ అధికారులు, సాయుధ పోలీసు సమక్షంలో విచారణ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రకూలీలు, స్మగ్లర్లను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకోవడం పీలేరులో చర్చనీయాంశమైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top