నల్లగొండ టు రాజస్థాన్‌ 

Revel to mystery of the two students - Sakshi

వీడిన ఆ ఇద్దరు   విద్యార్థినుల మిస్టరీ.. 

విజయవాడలో పట్టుకున్న నల్లగొండ పోలీసులు  

నల్లగొండ క్రైం: ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఐదురోజుల కిందట నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్‌ ఉదయసముద్రం రిజర్వాయర్‌ కట్టపై బ్యాగు, సూసైడ్‌ నోట్, చున్నీ, చెప్పులు వదిలి వెళ్లిన హబీబ్‌ ఉన్నీసా, తెగుళ్ల శ్రావణిల అదృశ్యం మిస్టరీని సోమవారం పోలీసులు ఛేదించి ఇరువురిని తల్లిదండ్రులకు అప్పగించారు. స్నేహితులైన వారిద్దరు వేర్వేరు చోట్ల ఉండలేక, ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రుల దృష్టి మళ్లించి కలసి బతికేందుకు ఇంటినుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. జనవరి 31న శ్రావణి, హబీబ్‌ ఉన్నీసాలు పానగల్‌ చెరువుకట్ట వద్ద బ్యాగ్‌ వదిలేసి నల్లగొండ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
 

అక్కడ నుంచి రైలులో ఈ విద్యార్థినులు మొదట గుంటూరు వెళ్లారు. తర్వాత చెన్నై, ముంబై, గుజరాత్, వడోదరా, రాజస్థాన్‌ ప్రాంతంలోని పుష్కర్‌కు వెళ్లారు. పుష్కర్‌లో కొత్త సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేసి హాస్టల్‌లో ఉన్న స్నేహితురాలిని ఫోన్‌లో సంప్రదించారు. అప్పటికే సెల్‌ లొకేషన్‌ సెర్చ్‌ చేస్తున్న పోలీసులు రాజస్థాన్‌లోని పుష్కర్‌లో వారు ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్, రాజస్థాన్‌ ప్రాంతాలు నచ్చకపోవడం, భాష సమస్య కారణంగా అక్కడ ఉండలేమని వారు విజయవాడ ప్రయాణమయ్యారు. ఈనెల 4న విజయవాడ సమీపంలోని కృష్ణలంక లబ్బీపేటలో వారు ఉన్నట్లు సెల్‌టవర్‌ లొకేషన్‌ చూపించింది. అప్పటికే వారిని వెతికేందుకు వెళ్లిన నల్లగొండ పోలీసులు సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా హబీబ్‌ ఉన్నీసా, శ్రావణిలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి నల్లగొండకు తీసుకొచ్చారు. విడిపోలేనంత స్నేహం కారణంగానే ఇద్దరూ కలిసి పారిపోయినట్లు సీఐ బాషా తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top