మరణం వెంటే మరణం.. !

Relative Died When Listen Brother in Law Death News - Sakshi

గుండెపోటుతో బావ మృతి దిగ్భ్రాంతికి గురై ఆగిన మరదలు గుండెచప్పుడు

ఒకే ఇంట గంట వ్యవధిలో  ఇద్దరు తిరిగిరాని లోకాలకు

కన్నీటిసంద్రమైన బాలకృష్ణాపురం

బావ హఠాన్మరణాన్ని తట్టుకోలేక ఓ మరదలు గుండె పగిలింది. గుండెపోటుకు గురైన బావ ఆస్పత్రి నుంచి విగత జీవిగా రావడం చూసి గుండెలవిసేలా ఏడ్చిన ఆమె అలాగే కుప్పకూలింది. అంతే! ఆమె గుండెచప్పుడూ ఆగిపోయింది. గంట వ్యవధిలో ఒకే ఇంట ఇద్దరి హఠాన్మరణాలు ఆ గ్రామాన్ని విషాదసంద్రంలో ముంచింది.

చిత్తూరు, సత్యవేడు : మండలంలోని బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆశీర్వాదం(38), అతని తమ్ముడు కార్తీక్‌ వ్యవసాయ కూలీలు. ఆశీర్వాదానికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కార్తీక్‌కు భార్య రేఖ (24), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకే ఇంట ఉమ్మడి కుటుంబంగా ఉన్న వీరంతా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎవరి ఏ కష్టమొచ్చినా పంచుకునేవారు. ఏడాది క్రితం ఆస్తిపంపకాలతో కుటుంబాలు వేరయ్యాయి. ఒకే ఇంట మధ్యలో గోడ వెలిసింది. అయినా వారి అనుబంధాలు చెరగిపోలేదు. ఎప్పటిలాగే రెండు కుటుంబాలు కష్టసుఖాలు పంచుకునేవి. ఈ నేపథ్యంలో, గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆశీర్వాదం గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన ఆటోలో తమ్ముడు కార్తీక్‌ తన వదిన, మరికొందరితో కలిసి సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని నిమిషాలకే ఆశీర్వదం మరణించారు. దీంతో అక్కడి నుంచే కార్తీక్‌ తన భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. బావ హఠాన్మరణం చెందడంతో రేఖ దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరై విలపించింది. ఇంతలో ఆశీర్వాదం మృతదేహం ఇంటికి చేరుకుంది. విగతజీవిగా ఉన్న బావను చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఉన్నపళాన అలాగే కుప్పకూలింది. సొమ్మసిల్లి పడిపోయిందేమోనని భావించిన కుటుంబ సభ్యులు నీటిని ఆమె ముఖంపై చిలకరించారు. నిమిషాలు గడుస్తున్నా ఆమె ఉలుకూ పలుకూ లేకుండా అచేతనంగా ఉండిపోయింది.కార్తీక్‌  ఆమెను తట్టి..తట్టి లేపేందుకు యత్నించాడు. శరీరం చల్లబడుతూ ఉండటం, ముక్కు వద్ద చేయి పెట్టినా శ్వాస తీసుకుంటున్న ఆనవాళ్లు లేకపోవడం అనుమానించాడు. తన భార్య కూడా హఠాన్మరణం చెందిందని గ్రహించేందుకు అట్టే సమయం పట్టలేదు. అటు సోదరుడు, ఇటు భార్య మృతదేహాల నడుమ అతని కళ్లు కట్టలు తెగిన చెరువే అయ్యింది. ఒకే ఇంట గంట వ్యవధిలో ఇద్దరి మృతి గ్రామాన్ని విషాదంలో ముంచింది. రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top