మీ స్థలం దక్కాలంటే.. ముడుపు చెల్లించాల్సిందే..

Registrar of Co-operative Department B Mosha Arrested In Bribery Case Visakhapatnam - Sakshi

పశు సంవర్థక శాఖ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి సహకార శాఖ రిజిస్ట్రార్‌ మోషా బెదిరింపు 

రూ.కోటి విలువ చేసే స్థలం తమ్ముడి పేరున రిజిస్ట్రేషన్‌

సాక్షి, జగదాంబ / ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): మీ సొసైటీకి సంబంధించిన భూమిపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి... వాటిని పరిష్కరించి మీ స్థలాలు మీకు దక్కేలా చేయాలంటే... ఓ 200 గజాల స్థలం నా తమ్ముడి పేరున రిజిస్ట్రేషన్‌ చేయించండి... లేదంటే మీ ఇష్టం... మీ స్థలాలు ఇబ్బందుల్లో పడతాయి... వాటిని రద్దు చేస్తానని బెదిరించిన సహకార శాఖ రిజిస్ట్రార్‌ బి.మోషా ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... పశు సంవర్థక శాఖ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీకి హనుమంతువాక సమీపంలో 18 ఎకరాల 78 సెంట్లు స్థలం ఉంది. ఈ సొసైటీలో 284 మంది సభ్యులున్నారు.

అయితే ఆ సొసైటీలో తన పేరు చేర్చలేదని ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రసాద్‌ అనే వ్యక్తి సహకార శాఖ రిజిస్ట్రార్‌ బి.మోషాకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయించిన మోషా సదరు సొసైటీ ప్రెసిడెంట్‌ సింహాద్రి అప్పడు, సెక్రటరీలను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. మీ సొసైటీ స్థలాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని... మీ స్థలాలు మీకు దక్కాలంటే 200 గజాలు స్థలం తన తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే వాటిని రద్దు చేస్తానని బెదిరించాడు. దీంతో రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేస్తూనే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం టర్నర్‌ చౌల్ట్రీ వద్ద ఉన్న రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో సిబ్బంది మోషాను, అతని సోదరుడు మల్లిఖార్జునరావును అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. ఇద్దరినీ అరెస్ట్‌ చేసి ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీరిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రంగరాజు తెలిపారు. ఆ స్థలం విలువ మార్కెట్‌లో కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రిజిస్ట్రార్‌ మోషా ఇంటిలో సోదాలు 
సొసైటీ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటూ ఏసీబీకి చిక్కిన సహకార శాఖ రిజిస్ట్రార్‌ బి.మోషా ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు మంగళవారం సోదాలు నిర్వహించారు. లాసెన్స్‌ బే కాలనీలో ఉన్న నివాసంలో అతని మేనల్లుడుని విచారించి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు ఖాళీ డాక్యుమెంట్లతోపాటు బినామీలు, బంధువులు పేరు మీద ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top