శ్రీనివాస్‌ హత్య కేసులో మళ్లీ దర్యాప్తు!

Re investigation in Srinivas murder case - Sakshi

     కేసుపై ఐజీ స్టీఫెన్‌ రవీంద్రతో డీజీపీ సమీక్ష

     నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశం

     డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లతో భేటీ అయిన ఐజీ

     కేసు పూర్వాపరాలు,  ఒత్తిళ్లపై ఆరా

     కాల్‌డేటాలోని అనుమానితులంతా పరారీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసుపై డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నుంచి కేసు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. శ్రీనివాస్‌ హత్య నుంచి నిందితుల అరెస్టు వరకు జరిగిన పరిణామాలన్నింటినీ స్టీఫెన్‌ రవీంద్ర ఓ నివేదిక రూపంలో డీజీపీకి అందించారు. దీంతో.. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఏయే అంశాల్లో నిర్లక్ష్యం వహించారు, నిందితుల కాల్‌డేటాలో ఉన్న నంబర్లు ఎవరివి, వారికి నిందితులకు ఉన్న సంబంధమేమిటి, హత్య జరిగిన రోజు, తర్వాతి రోజు పదే పదే వెళ్లిన ఫోన్‌కాల్స్‌ వివరాలేమిటన్న అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్టీఫెన్‌ రవీంద్రను డీజీపీని ఆదేశించినట్టు తెలిసింది.
 
మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు! 
శ్రీనివాస్‌ హత్య జరిగిన జనవరి 24 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటిపైనా డీజీపీ సమీక్షించడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా గందరగోళంగా ఉండటం, కాల్‌డేటాను గాలికి వదిలేయడం, నిందితులను కస్టడీలోకి తీసుకోకపోవడం, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న అంశాలు.. వంటివన్నీ తేలనున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ అదృశ్యం వెనక ఉన్న కారణాలు, ఒత్తిళ్లు వచ్చి ఉంటే అలా ఒత్తిడి చేసిందెవరన్న దానిపై నివేదిక ఇవ్వాలని కూడా డీజీపీ ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేసుకు సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టవద్దని, ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం సన్నగిల్లకుండా విచారణ జరగాలని ఆదేశించినట్టు సమాచారం. 

డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లతో ఐజీ భేటీ 
శ్రీనివాస్‌ హత్య కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నారాయణ్‌పేట్‌ డీఎస్పీ శ్రీధర్‌తో పాటు నల్లగొండ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు సోమవారం ఐజీ స్టీఫెన్‌ రవీంద్రను కలిశారు. కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. అయితే కాల్‌డేటాను విశ్లేషించడంలో నిర్లక్ష్యం, ఆ కాల్‌డేటాలోని గుర్తించి విచారించకపోవడంపై ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఆరా తీసినట్టు తెలిసింది. 

అనుమానితులు పరారీ 
బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో కాల్‌డేటాతో పేర్లు బయటికి వచ్చిన వారంతా పరారీలో ఉన్నట్టు నల్లగొండ పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఒకవేళ వారికి హత్యతో సంబంధం లేకుంటే ఎందుకు పరారయ్యారు, కారణాలేమిటన్న దానిపై దర్యాప్తు జరపాలని... రాంబాబు, మల్లేశ్‌ల కాల్‌డేటాలోని మిగతా అనుమానాస్పద నంబర్ల విషయం తేల్చాలని ఇన్‌స్పెక్టర్, డీఎస్పీలను ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించినట్టు తెలుస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top