ప్రణయ్‌ హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదల

Pranai murder case Accused released on bail - Sakshi

వరంగల్‌: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఆదివారం బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేయగా నిందితుల బంధువులు ఆ ఉత్తర్వులను శనివారం రాత్రి తీసుకురావడంతో విడుదల ఆదివారానికి వాయిదా పడింది. ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు అధికారులు 8.20 గంటలకు మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలను విడుదల చేశారు. ఈ ముగ్గురిపై గత ఏడాది సెప్టెంబర్‌ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముగ్గురు వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

బెయిల్‌ కోసం వీరు రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. బెయిల్‌ మంజూరు చేయద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు కోర్టుకు విన్నవించడంతో బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత తిరిగి బెయిల్‌ కోరుతూ నిందితులు ముగ్గురూ ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్‌ దాఖలు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ముగ్గురిని విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్‌ ఎన్‌.మురళీబాబు తెలిపారు. విడుదలైన వెంటనే నిందితులు రెండు వాహనాల్లో తమ బంధువులతో కలసి వెళ్లిపోయారు. 

ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలి 
అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్‌ 
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్‌ చేసింది. తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సమాఖ్య అధ్యక్షుడు ఆనందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారికి ఎలాంటిహాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top